మన్యంలో మొదలైన పెద్ద పండగ

ABN , First Publish Date - 2022-01-18T04:29:23+05:30 IST

మన్యంలోని గిరిజనుల సంప్రదాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభించారు.

మన్యంలో మొదలైన పెద్ద పండగ
పాడేరు మండలం లింగాపుట్టులో సంక్రాంతి సంబరాల్లో వేషధారణలు



పుష్యమాసం ఆఖరు రెండు వారాలు గిరి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు 

రాత్రి వేళల్లో థింసా నృత్యాలు, డప్పువాయిద్యాలతో ఆటపాట

పాడేరు, జనవరి 17: మన్యంలోని గిరిజనుల సంప్రదాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభించారు. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాల్లో ఎక్కడో చోట సంక్రాంతి పండగను గిరిజనులు ఉత్సాహంగా జరుపుకొంటారు. పుష్యమాసం వచ్చిన రెండో వారం తర్వాత గిరిజనులు భోగి చేసుకుంటారు. గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, కర్రలను భోగి మంటలో వేస్తారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు. భోగి రోజు నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు, ఽథింసా నృత్యాలతో సందడిగా ఉంటుంది. వ్యవసాయాధారంగా జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి పండగ నిర్వహించుకుని, తమ పనిముట్లకు పూజలు చేస్తారు. మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల పండగ అంటారు. ఈ పండగను కేవలం పశువుల కోసమే చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రగ్గులు పూసి, అరెశలు, బూరెలు, గారెలతో చేసిన దండలను వాటికి వేస్తారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెడతారు. 


పుష్యమాసాంతం వరకు సందడి 

గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్యమాసం రెండో వారం(పౌర్ణమి) నుంచి పక్షం రోజులు సంక్రాంతి పండగను నిర్వహిస్తారు. దీనిని స్థానిక భాషలో ’పుష్య పోరోబ్‌’ అంటారు. జనవరి 17 నుంచి 31వ తేదీ వరకు ఏజెన్సీ పల్లెల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లో వారి బంధువులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో విందు భోజనాలు పెడతారు. అలాగే కొత్త బట్టలను పెడతారు. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రుళ్లు మహిళలు ఽథింసా నృత్యాలు, పురుషులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో పుష్యమాసంలో ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి.  

Updated Date - 2022-01-18T04:29:23+05:30 IST