బేరం కుదిరింది

ABN , First Publish Date - 2022-07-15T06:28:37+05:30 IST

ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌ విద్యారులకు భోజనం పెట్టే బాధ్యతలను ఇస్కానకు అప్పగించారు.

బేరం కుదిరింది
ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో చర్చ

భోజనానికి రోజుకు రూ.70

ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థులకు వడ్డన

ఇస్కాన్‌కు భోజనం బాధ్యతలు

అనంతపురం సెంట్రల్‌, జూలై 14: ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌ విద్యారులకు భోజనం పెట్టే బాధ్యతలను ఇస్కాన్‌కు అప్పగించారు. ఆర్ట్స్‌ కళాశాల యాజమాన్యంతో విద్యార్థుల తరపున ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గురువారం చర్చలు జరిపారు. రోజుకు రూ.70తో భోజనం పెట్టించేలా బేరం కుదిర్చారు. అయితే 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉంటేనే రూ.70కు భోజనం పెట్టగలమని, లేదంటే గిట్టుబాటు కాదని ఇస్కాన్ ప్రతినిధులు షరతు పెట్టారు. హాస్టల్‌లో ఉండే ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు డిపాజిట్‌ కట్టించుకోవాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది.


కొవిడ్‌తో మూసివేత

ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో రెండు వేల మంది విద్యార్థులు ఉండేవారు. కొవిడ్‌ కారణంగా 2020 నుంచి హాస్టల్‌ను మూసివేశారు. దీంతో గ్రామీణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌ను పునఃప్రారంభించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ప్రిన్సిపాల్‌ నాగలింగారెడ్డికి పలుమార్లు విన్నవించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఎంపీ రంగయ్య దృష్టికి విద్యార్థులు హాస్టల్‌ సమస్యను తీసుకెళ్లారు. అదే సమయంలో అక్కడున్న ఎస్కేయూ ప్రొఫెసర్‌ కృష్ణకుమారి క్యాంపస్‌ విద్యార్థులకు రోజుకు రూ.30 నుంచి రూ.40 ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో హాస్టల్‌ను పునఃప్రారంభించేలా సూస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ఎస్కేయూ హాస్టల్‌ నిర్వహణ వివరాలను సేకరించారు. కానీ అంత తక్కువ మొత్తంతో హాస్టల్‌ను నిర్వహించలేమని ఆర్ట్స్‌ కాలేజీ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో విద్యార్థుల భోజనంపై రెండు రోజులపాటు పంచాయితీ చేయాల్సి వచ్చింది.



ఇదేం తీరు..?

ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థులకు భోజనం పెట్టే వ్యవహారంపై బేరసారాలు జరగడం విమర్శలకు తావిస్తోంది. ఎస్కేయూతో పోలిస్తే రెట్టింపు ధరలకు ఇస్కాన్‌కు బాధ్యతలు అప్పగించారు. దీనికితోడు ఒక్కో విద్యార్థి నుంచి కాలేజీ యాజమాన్యం రూ.5 వేలు డిపాజిట్‌ కట్టించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మక కాలేజీకి ఈ దుస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ నిధుల నుంచి కొంత వెచ్చించి.. ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌ నిర్వహణకు సహకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-07-15T06:28:37+05:30 IST