పరువు నష్టం కేసులో దేవె గౌడకు షాక్ ఇచ్చిన బెంగళూరు కోర్టు

ABN , First Publish Date - 2021-06-22T19:12:50+05:30 IST

పదేళ్ళ క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు

పరువు నష్టం కేసులో దేవె గౌడకు షాక్ ఇచ్చిన బెంగళూరు కోర్టు

బెంగళూరు : పదేళ్ళ క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఓ కోర్టు మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన గౌడ నిర్థరించారు. 


బీదర్ (దక్షిణ) మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (నైస్) గురించి పదేళ్ళ క్రితం ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో దేవె గౌడ చేసిన వ్యాఖ్యలపై ఈ తీర్పు వెలువడింది. 


2011 జూన్ 28న ఓ కన్నడ వార్తా ఛానల్ ‘‘గౌడర గర్జనే’’ శీర్షికతో దేవె గౌడ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. నైస్ ప్రాజెక్టు ఓ దోపిడీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వల్ల ఆ కంపెనీకి పరువు నష్టం జరిగిందని కోర్టు నిర్థరించింది. ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని ఆయనను ఆదేశించింది. ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు, హైకోర్టు తమ తీర్పుల్లో సమర్థించిన విషయాన్ని ప్రస్తావించింది. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించినట్లయితే, భవిష్యత్తులో ఇటువంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయడం కష్టమవుతుందని తెలిపింది. 




Updated Date - 2021-06-22T19:12:50+05:30 IST