ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడైనా సంచులు, బ్యాగులు కనిపిస్తే.. దగ్గరికి వెళ్లేందుకు కూడా భయపడతారు. ఇటీవల బాంబు దాడులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం సాధారణమైంది. ముంబైలో కూడా ఇలాగే ఓ రైల్లో బ్యాగు కనిపించడం కలకలం సృష్టించింది. దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు బ్యాగు తెరిచి చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
అది ముంబై పరిధిలోని టిట్వాల రైల్వే స్టేషన్.. నవంబర్ 20వ తేదీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చివరి లోకల్ రైలు వచ్చి ఆగింది. ప్రయాణికులతో స్టేషన్ మొత్తం రద్దీ రద్దీగా ఉంది. ఇదే సమయంలో మహిళల బోగీలో ఓ మూల బ్యాగు ఉండడాన్ని గుర్తించారు. దాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చింది. అందులో ఏముందో తెలీక అంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బ్యాగును తెరచి చూశారు. ఆ బ్యాగులో పసికందు ఉండడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న కల్యాణ్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అక్కడున్న వారందరినీ విచారించారు.
అనంతరం రైలు వచ్చిన మార్గంలోని అన్ని స్టేషన్లలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో వారికి ఓ మహిళపై అనుమానం కలిగింది. కోపర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన ఆ మహిళ చేతిలో బ్యాగు ఉండడం, డోంబివలి స్టేషన్లో దిగిపోయిన సమయంలో బ్యాగు లేకపోవడాన్ని గుర్తించారు. ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే శిశువును వదిలేసి వెళ్లినట్లు అంగీకరించింది. ఈ కేసులో ఆమెతో పాటూ ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ కలిసి ఈ పని చేసినట్లు తేలింది. పసికందును నేరుల్ ప్రాంతంలోని విశ్వ బాలుర సంరక్షణ కేంద్రంలో అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.