నత్తనడకన 50 గదుల సత్రం పనులు

ABN , First Publish Date - 2022-08-19T05:50:36+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తుల కోసం చేపట్టిన 50గదుల సత్రం భవనం నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

నత్తనడకన 50 గదుల సత్రం పనులు
కొనసాగుతున్న సత్రం భవనం పనులు

నాలుగేళ్లవుతున్నా పూర్తికాని వైనం

చేర్యాల, ఆగస్టు 18: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తుల కోసం చేపట్టిన 50గదుల సత్రం భవనం నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తికా లేదు. సిద్దిపేట జిల్లా తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆలయాభివృద్ధికి రూ.10కోట్లు ప్రకటించారు. దీంతో వసతిగదులు కట్టాలని నిర్ణయించి బండగుట్ట స్థలాన్ని ప్రతిపాదించారు. ముందస్తుగా రూ.6.30కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, మరో రూ.6కోట్లు అవసరం కావడంతో ఆలయ నిధులను కేటాయించారు. అయినప్పటికీ ఎన్నో అవాంతరాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఆలయంలో యేటా మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సుమారు 10లక్షల మేర భక్తులు తరలివస్తారు. అలాగే సాధారణ రోజులలోనూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయ పరిధిలో దాతలు నిర్మించి ఇచ్చిన 130 ధర్మశాలలు ఏమాత్రం సరిపడని పరిస్థితి నెలకొంది. వీటిలో మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో వసతిగదుల నిర్మాణం అవశ్యంగా మారినా, 50గదుల సత్రం నిర్మాణం ఆశించిన సమయంలో అందుబాటులోకి రాకపోవడంతో ఏటా భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటివరకు గ్రౌండ్‌ఫ్లోర్‌ పనులు పూర్తయ్యాయి. రెండో అంతస్తు పనులు ప్రాథమిక దశలోఉన్నాయి.  దీంతో ఎన్నాళ్లకు అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే డిసెంబర్‌  నెలాంతంలో స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.  ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయించి స్వామివారి కల్యాణంలోగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-08-19T05:50:36+05:30 IST