Tearful Incident: అమ్మ చనిపోయిందని తెలియక తల్లిపై తలవాల్చిన పిల్లాడు.. రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన..

ABN , First Publish Date - 2022-08-05T03:30:34+05:30 IST

ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు. నిరాదరణకు గురైంది. సమాజం చిన్నచూపు చూసిందో, కట్టుకున్న వాడు సంబంధమే లేదని కఠినంగా వ్యవహరించి వదిలేసి వెళ్లిపోయాడో. పాపం.. ఆ 35 ఏళ్ల మహిళ మూడేళ్ల వయసున్న కొడుకును..

Tearful Incident: అమ్మ చనిపోయిందని తెలియక తల్లిపై తలవాల్చిన పిల్లాడు.. రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన..

ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు. నిరాదరణకు గురైంది. సమాజం చిన్నచూపు చూసిందో, కట్టుకున్న వాడు సంబంధమే లేదని కఠినంగా వ్యవహరించి వదిలేసి వెళ్లిపోయాడో. పాపం.. ఆ 35 ఏళ్ల మహిళ మూడేళ్ల వయసున్న కొడుకును తీసుకుని రైలు బండెక్కి బీహార్‌లోని భగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఆమె అనారోగ్యం బారిన పడి బాధపడుతోంది కాబోలు. రైల్వే స్టేషన్‌లో పిల్లాడితో కలిసి కూర్చున్న ఆ కన్న తల్లి కూలబడిపోయింది. కూర్చునే ఓపిక కూడా లేక పిల్లర్ స్తంభానికి ఆనుకుని పడుకుంది. ఆ దీనురాలి స్థితిని చూసి కూడా జాలి లేని చావుకు గుండె కరగలేదు. పిల్లాడి ముఖం చూసి కూడా పోనీలే పాపం అనుకోలేదు. ఆ అసహాయురాలి ప్రాణాన్ని చావు అమాంతం తీసుకెళ్లిపోయింది. ఆ పిల్లాడిని ఎవరూ లేని అనాథను చేసింది. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియని ఆ బాబు ఆమె తలపై తలవాల్చి పడుకుండిపోయాడు. ఏం తిన్నాడో, ఎప్పుడు తిన్నాడో పాపం. తల్లి తనువుపై తలవాల్చి ఆకలిని దిగమింగుకుని సేద తీరాడు.



రైల్వే అధికారులు ఆ పిల్లాడు తల్లిపై పడుకున్న దృశ్యాన్ని చూసి చలించిపోయారు. కానీ.. వాళ్లు ఆమెను గుర్తించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ పిల్లాడు కూడా మానసికంగా అంత చురుకుగా లేడని వైద్యులు గుర్తించారు. ఈ విషాద ఘటనను బీహార్‌లోని భగల్‌పూర్ రైల్వే స్టేషన్ మౌనంగా భరించింది. ఆ పిల్లాడిని చైల్డ్ కేర్ హోంకు తరలించారు. ఆ మహిళ ఫొటోను, పిల్లాడి ఫొటోను తీసి కుటుంబ సభ్యులు గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పాంప్లేట్లు పంచారు. ఆమె చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు. 72 గంటల పాటు ఆ మహిళ మృతదేహాన్ని మార్చరీలో ఉంచి ఆమెకు సంబంధించిన వారి కోసం రైల్వే అధికారులు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో చివరకు వాళ్లే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఏ తల్లికీ రాకూడదని కష్టమిది. ఏ బిడ్డకూ ఈ పరిస్థితి రాకూడదు.

Updated Date - 2022-08-05T03:30:34+05:30 IST