Mumbai Teacher: స్కూల్‌కు రోజూలానే వెళితే లిఫ్ట్‌లో ప్రాణం పోతుందని ఈ టీచర్ ఊహించలేదు..

ABN , First Publish Date - 2022-09-18T02:52:14+05:30 IST

మనిషికి చావు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అప్పటివరకూ మన మధ్యే ఉన్న మనిషిని ఊహించని విధంగా..

Mumbai Teacher: స్కూల్‌కు రోజూలానే వెళితే లిఫ్ట్‌లో ప్రాణం పోతుందని ఈ టీచర్ ఊహించలేదు..

ముంబై: మనిషికి చావు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అప్పటివరకూ మన మధ్యే ఉన్న మనిషిని ఊహించని విధంగా మృత్యువు పలకరించొచ్చు. క్షణాల్లోనే ప్రాణం గాలిలో కలిసిపోవచ్చు. క్షణాల్లోనే అలా వచ్చి ఇలా చటుక్కున ప్రాణాన్ని మృత్యువు హరించిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషాద ఘటనే ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి వయసు 26 సంవత్సరాలు. ఇంకా ఎంతో భవిష్యత్ ఉంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ స్కూల్‌లో టీచర్‌గా (Mumbai Teacher) పనిచేస్తోంది. కానీ.. ఆమె జీవితం సాఫీగా సాగిపోవడం విధికి నచ్చలేదేమో. ఆ యువతిని స్కూల్ లిఫ్ట్ రూపంలో (School Teacher Stuck In Lift) మృత్యువు పలకరించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ ముంబైలోని (North Mumbai) మలాద్ (Malad) ప్రాంతంలో సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌ (St Mary’s English School) ఉంది.



ఈ స్కూల్‌లో జెనెల్ ఫెర్నాండెజ్ అనే 26 ఏళ్ల యువతి టీచర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం కూడా రోజూలానే స్కూల్‌కు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టాఫ్‌ రూంకు వెళ్లేందుకు ఆరవ ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం వేచి చూసింది. లిఫ్ట్ రాగానే ఆమె లోపలికి వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి లిఫ్ట్ డోర్లు మూసుకున్నాయి. ఆ లిఫ్ట్ డోర్ల మధ్యలో ఆమె చిక్కుకుపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ కదిలి వెళ్లింది. స్కూల్‌లో ఉన్న వాళ్లు గమనించి చూసి ఆమెను లిఫ్ట్ డోర్లలో ఇరుక్కుపోయిన ఆమెను బయటపడేశారు. అయితే.. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడింది. సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను హుటాహుటిన తరలించారు. అయితే.. అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.



పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లాసు ముగించుకుని లిఫ్ట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి ఆరవ ఫ్లోర్ నుంచి ఏడవ ఫ్లోర్ వరకూ లిఫ్ట్ కదిలి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. జెనెల్ ఫెర్నాండెజ్ ఊహించని విధంగా ఇలా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి చనిపోవడంతో పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంలో మునిగిపోయింది. పిల్లలకు జెనెల్ ఫెర్నాండెజ్ ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆమె అకాల మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని పాఠశాల యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-18T02:52:14+05:30 IST