Chennai Custodial Death: ఒంటి మీద 13 చోట్ల గాయాలు.. విఘ్నేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-05-05T21:42:09+05:30 IST

తమిళనాడులో పోలీస్ కస్టడీలో వెలుగుచూస్తున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. గత నెలలో విఘ్నేష్ అనే 25 ఏళ్ల యువకుడిని G5 సెక్రటేరియట్ కాలనీ పోలీసులు గంజాయి అమ్ముతున్నాడనే ఆరోపణలతో..

Chennai Custodial Death: ఒంటి మీద 13 చోట్ల గాయాలు.. విఘ్నేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..

చెన్నై: తమిళనాడులో పోలీస్ కస్టడీలో వెలుగుచూస్తున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. గత నెలలో విఘ్నేష్ అనే 25 ఏళ్ల యువకుడిని G5 సెక్రటేరియట్ కాలనీ పోలీసులు గంజాయి అమ్ముతున్నాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే విఘ్నేష్ పోలీస్ స్టేషన్‌లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. విఘ్నేష్ మూర్ఛ వచ్చి చనిపోయాడని పోలీసులు చెప్పారు. విఘ్నేష్ కుటుంబం అతనిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. విఘ్నేష్ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది.



విఘ్నేష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆ రిపోర్ట్ తాజాగా బయటికొచ్చింది. విఘ్నేష్ శరీరంపై 13 చోట్ల గాయాలున్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెల్లడించింది. విఘ్నేష్ మృతికి కారణమేంటనేది కచ్చితంగా తెలియనప్పటికీ ఈ రిపోర్ట్‌లో వెల్లడైన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. విఘ్నేష్ తల, కళ్లు, గడ్డం, భుజాలపై గాయాలున్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్ తేల్చడంతో కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పోలీసులే కొట్టి చంపారని బలంగా వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి వివాదాస్పదంగా మారింది. ఇద్దరు పోలీసులు విఘ్నేష్‌ను వెంటాడి మరీ పట్టుకున్నారు. ఆ క్రమంలో విఘ్నేష్‌ను తోసేశారు. కిందపడిన అతనిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు విఘ్నేష్‌ను కస్టడీకి తీసుకునే క్రమంలో ఒక పోలీస్ కిందపడిన ఏదో వస్తువును తీసుకున్నట్లుగా ఫుటేజ్‌లో కనిపించింది.



విఘ్నేష్ పారిపోతున్న సమయంలో తమపైకి కత్తి విసిరాడని, ఆ కత్తినే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విఘ్నేష్ మృతి చెందడంతో ఈ ఘటనలో ఇప్పటికే ఎస్ఐని, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం CB-CIDకి బదిలీ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. విఘ్నేష్ మృతి కేసులో నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరుపుతామని సీఎం బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఒక కెమెరాలో రికార్డయిన దృశ్యాలే బయటకు వచ్చాయని, మొత్తం 15 కెమెరాల వరకూ ఉన్నాయని.. ఆ కెమెరాలేవి పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారని People’s Watch a Human Rights Organisation డైరెక్టర్ హెన్రీ తెలిపారు.

Read more