అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 99శాతం..: డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2020-07-05T22:14:57+05:30 IST

కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలతం చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో కరోనా కేసుల విషయంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం

అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 99శాతం..: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలతం చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో కరోనా కేసుల విషయంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వేళితే.. శనివారం రోజు అమెరికా 244వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ..‘అమెరికాలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 99శాతం కేసులు ప్రమాదరహితమైనవి’అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికాలో 40 మిలియన్ల మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద మొత్తంలో, అత్యంత నాణ్యతగా కరోనా పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఇదే సమయంలో మరోసారి చైనాపై డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో గత కొన్ని రోజులుగా 50వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యనిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనాసగితే.. రాబోయే రోజుల్లో రోజుకు లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే.. మరణాల సంఖ్య ఉహకందని విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 29.36లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. మరణించిన వారి సంఖ్య 1.32లక్షలకు చేరింది.


Updated Date - 2020-07-05T22:14:57+05:30 IST