Abn logo
Mar 29 2020 @ 06:15AM

తీపి కబురు!

రెండో విడత ‘తితలీ’ పరిహారం విడుదల 

12 మండలాలకు రూ.9868.48 లక్షలు  


(పలాస/సోంపేట): తితలీ తుపాను బాధితులకు శుభవార్త. ప్రభుత్వం ప్రకటించిన మేరకు పెంచిన నష్టపరిహారం విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.9861.48 లక్షలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018 అక్టోబరు 11న తితలీ విలయానికి టెక్కలి డివిజన్‌ అతలాకుతలమైంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి తదితర మండలాలకు అపార నష్టం వాటిల్లింది. జీడి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఉద్దానం స్వరూపమే మారిపోయింది.  మరో 20 ఏళ్ల వరకు రైతులకు జీవనోపాధి పూర్తిగా లేకుండా చేసింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విపత్తుపై త్వరితగతిన స్పందించింది.


రూ.550 కోట్లు విడుదల చేస్తు కొబ్బరి చెట్టుకు రూ.1500, జీడి పంటకు  హెక్టారుకు రూ.30వేల వంతున నష్టపరిహారాన్ని చెల్లించింది. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌  తమ పార్టీ అధికారంలోకి వస్తే పరిహారాన్ని  రెండింతలు చేస్తానని హామీ ఇచ్చారు. గద్దె ఎక్కిన తరువాత 11 నెలల అనంతరం పెంచుతామన్న నష్టపరిహాన్ని ఇస్తూ తాజాగా జీవో విడుదల చేశారు. ఆర్థికంగా కుదేలైన ఈ ప్రాంత  రైతులకు పెంచిన నష్టపరిహారం ఎంతో ఊరటనిచ్చింది. తమ బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు పడే అవకాశం ఉండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 మండలాలకు సంబంధించి మొత్తం 69,574 మంది రైతులకు పెంచిన నష్టపరిహారం అందనుంది. గతంలో నష్టపరిహారం చెల్లింపులో భారీ అవకతవకలు జరిగాయని భావించిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం కూడా అవే బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడానికి చర్యలు ప్రారంభిస్తుండడంతో నిజమైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందటే గ్రామాల్లో సర్వే చేసి తితలీ బాధిత రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. 


ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం 

తాము అధికారంలోకి రాగానే ఎన్నికలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వమని, గతంలో అర్హత లేకపోయినా నష్టపరిహారాన్ని మింగారని, ప్రస్తుతం పూర్తి సర్వే చేసిన తరువాత లబ్ధిదారులను గుర్తించి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్దానం రైతుల తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement