లీటరుకు 970 ఎంఎల్‌ పెట్రోలే!

ABN , First Publish Date - 2020-09-05T09:24:05+05:30 IST

పెట్రోలు బంకుల్లో వాహనానికి 1000 ఎంఎల్‌ (లీటరు) పెట్రోలు కొట్టినట్టు మనకు ..

లీటరుకు 970 ఎంఎల్‌ పెట్రోలే!

ఎలక్ట్రిక్‌ చిప్‌లతో మాయాజాలం

గుట్టురట్టు చేసిన నాయుడుపేట పోలీసులు

ముగ్గురి అరెస్టు.. మరొకరి కోసం గాలింపు 

పశ్చిమలో 11 పెట్రోలు బంకులపైనా కేసు నమోదు 


నాయుడుపేట టౌన్‌/ఏలూరు క్రైం, సెప్టెంబరు 4: పెట్రోలు బంకుల్లో వాహనానికి 1000 ఎంఎల్‌ (లీటరు) పెట్రోలు కొట్టినట్టు మనకు కనిపిస్తుంది. కానీ, పెట్రోలు మాత్రం 970 ఎంఎల్‌ మాత్రమే బండిలోకి వెళుతుంది. ఈ మాయాజాలాన్ని నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు ఛేదించారు. దొంగమీటర్లతో వాహనదారులను మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి నాయుడుపేటలో ఆయన విలేకరులకు పూర్తి వివరాలను వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన బాషా పెట్రో కొలతలో మోసంచేసే ఎలక్ర్టానిక్‌ చిప్‌లను తయారు చేస్తుంటాడు. గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన సురేష్‌ ఈ చిప్‌ను రూ.60 వేలకు కొనుగోలుచేసి నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌ ప్రాంతంలో తాను నడుపుతున్న పెట్రోలు బంకులో అమర్చాడు.


దీనివల్ల వెయ్యి ఎంఎల్‌కు 70 ఎంఎల్‌ పెట్రోలు, డీజిల్‌ మాత్రమే వాహనదారులకు విక్రయిస్తూ మోసానికి పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకు యజమాని శ్రీనివాసులుకు కూడా ఓ చిప్‌ను అమ్మినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. ఈ కేసులో నాదేళ్ల సురే్‌షతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఉయ్యాల మధు, చౌడం రామకృష్ణలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాసులు కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన నాయుడుపేట సీఐ వేణుగోపాల్‌రెడ్డి, మెట్రాలజీ  ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ కరీముల్లా, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎలకా్ట్రనిక్‌ కార్డును అమర్చి కొలతలలో వినియోగదారునికి తక్కువ పెట్రోలు వెళ్లేలా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న 11 పెట్రోలు బంకులపై పశ్చిమ  గోదావరి పోలీసులు కేసులు నమోదు చేశారు.


జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ పర్యవేక్షణలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పెట్రోలు బంకులపై ఏకకాలంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎలకా్ట్రనిక్‌ కార్డును అమర్చి లీటరుకు 30 మిల్లీ లీటర్ల పెట్రోలు తక్కువ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా 10 లీటర్లపైబడి పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకునేవారికి మరింత తగ్గే విధంగా ఆ ఎలకా్ట్రనిక్‌ కార్డును అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. వీరందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు.

Updated Date - 2020-09-05T09:24:05+05:30 IST