రాష్ట్రంలో 97 శాతం మందికి Omicron లక్షణాలు!

ABN , First Publish Date - 2022-02-11T13:11:05+05:30 IST

తీవ్ర అస్వస్థత లేకపోవడంతో బతికి పోయాంగానీ, కరోనా ఒమైక్రాన్‌ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసినట్లే అవగతమవుతోంది. గత మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలున్న వారికి చేసిన పరీక్షల్లో 97 శాతం

రాష్ట్రంలో 97 శాతం మందికి Omicron లక్షణాలు!

       - తీవ్ర అస్వస్థత లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం


పెరంబూర్‌(చెన్నై): తీవ్ర అస్వస్థత లేకపోవడంతో బతికి పోయాంగానీ, కరోనా ఒమైక్రాన్‌ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసినట్లే అవగతమవుతోంది. గత మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలున్న వారికి చేసిన పరీక్షల్లో 97 శాతం మందికి ఒమైక్రాన్‌ సోకినట్లు స్పష్టమైంది. మిగిలిన 3 శాతం డెల్టా వేరియంట్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఈ మేరకు దిగ్ర్భాంతి కరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే మేరకు.. 2020 నవంబరులో నిర్వహించిన సర్వేలో 32 శాతం మంది, 2021 ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో 29 శాతం, అదే ఏడాది అక్టోబరులో నిర్వహించిన సర్వేలో 70 శాతం మందికి వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని సర్వేలో తేలింది. నాలుగో విడత సర్వేలో 1,706 మంది సభ్యులతో కూడిన 30 బృందాలు 32,245 గ్రామాలు సహా పట్టణాల్లో ప్రజల రక్తనమూనాలు సేకరించి పరిశీలించి ఈ ఫలితాలను ఇటీవల వెల్లడించారు. ఆ ప్రకారం, పదేళ్ల పైబడిన వారిలో 87 శాతం వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని వైద్యులు తెలిపారు.


600 చోట్ల బూస్టర్‌ డోస్‌ టీకాలు: మంత్రి సుబ్రమణ్యం

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 600 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూస్టర్‌ డోస్‌ శిబిరాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లా డుతూ... రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌లు ఎంత వేగంగా వ్యాప్తి చెందాయో అంతే వేగంతో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, రెండు విడతల వాక్సినేషన్‌ డ్రైవ్‌ల ను సమర్థవంతంగా నిర్వహించడంతో వైరస్‌ కట్టడిలోకి వస్తోందని వెల్ల డించారు.. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3500లకు తగ్గటం ఊరట కలిగిస్తోందన్నారు. ఇటీవల ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎంతమేరకు పెరిగిందన్న అంశంపై సర్వేలు నిర్వహించామని, రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్నవారిలో రోగనిరోధక శక్తి 90 శాతం పెరిగినట్లు వెల్లడైందని వివరించారు. టీకా వేసుకోనివారిలో 69 శాతం వరకే రోగ నిరోధక శక్తి ఉన్నట్లు ఆ సర్వేల ద్వారా తెలిసిందన్నారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన వేసుకోవాలని, అప్పుడే కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని తెలి పారు. ఇక రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసుకున్నవారి సంఖ్య 60 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 600 శిబిరాలలో బూస్టర్‌ డోస్‌ టీకాలు వేశామని, రెండు డోస్‌ల టీకాలు వేసుకున్నవారు బూస్టర్‌ డోస్‌ కోసం బారులు తీరటం తమకెంతో సంతృప్తిని కలిగిస్తోందని  మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2022-02-11T13:11:05+05:30 IST