90శాతం ఒమైక్రాన్‌ కేసులే!

ABN , First Publish Date - 2022-01-20T07:25:27+05:30 IST

90శాతం ఒమైక్రాన్‌ కేసులే!

90శాతం ఒమైక్రాన్‌ కేసులే!

గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్‌ 

డెల్టా కంటే పదిరెట్లు వేగంగా వ్యాప్తి 

విశాఖ, కృష్ణా, చిత్తూరు, కర్నూలుల్లో అత్యధికం 

మిగిలిన జిల్లాల్లో 50శాతం లోపు నమోదు 

ఆస్పత్రుల పాలవుతున్నది 10శాతం మందే 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 90శాతం ఒమైక్రాన్‌ వేరియంట్‌వేనని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లో రోజువారీ పరీక్షల్లో అత్యధిక కేసులు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంది. డెల్టా, డెల్టా ప్లస్‌ కంటే 10రెట్లు వేగంగా కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ వచ్చినవారిలో చాలామందికి ఒకటి, రెండు రోజుల వ్యవధిలో జ్వరం, జలుబు వచ్చి తగ్గిపోతున్నాయి. 10శాతం మంది మాత్రం తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారు. చాలామందికి అసలు లక్షణాలు బయటపడటం లేదు. మరికొందరికి స్వల్ప లక్షణాలు కనిపించినా మందులతో తగ్గిపోతోంది. కరోనా మొదటి, రెండోదశ తరహాలో ఇప్పటి వరకూ ప్రమాదకర స్థాయికి వెళ్లలేదని వైద్యులు చెబుతున్నారు. మరో 10, 15 రోజుల్లో ఒమైక్రాన్‌పై పూర్తి అవగాహన వస్తుందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని ఒమైక్రాన్‌ చుట్టేసింది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ బాధితులున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు, యాంటీబాడీలు తక్కువగా ఉన్నవారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారీగా కూడా ఒమైక్రాన్‌ కేసుల శాతం మారుతోంది. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ శాతం ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కేసుల శాతం కొద్దిగా తక్కువగా ఉంది. కృష్ణా, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వస్తున్న పాజిటివ్‌లలో 90 శాతం ఒమైక్రాన్‌వే అని వైద్యులు చెబుతున్నారు. 


లక్షణాల్లో మార్పులు 

సాధారణ కరోనాకు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉండేవి. ఒమైక్రాన్‌లో చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే బయటపడుతున్నాయి. ఈ వేరియంట్‌ సోకిన వారికి సాధారణ జ్వరంతో పాటు జబులు, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో 90శాతం మందికి ఇంట్లోనే ఉండి మందులు వాడుకుంటే తగ్గిపోతోంది. 10శాతం మంది మాత్రం ఆస్పత్రుల పాలవుతున్నారు. వారు కూడా ఐసీయూ వరకూ వెళ్లకుండా సాధారణ మెడికేషన్‌తో బయటపడుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒమైక్రాన్‌ వ్యాప్తిలో వేగం దృష్ట్యా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ప్రయాణాలను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిదని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-01-20T07:25:27+05:30 IST