మెడిసిన్ చదివేందుకు ఫారిన్ వెళ్లే భారతీయుల్లో 90 శాతం వాళ్లే: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-03-02T00:34:11+05:30 IST

వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల్లో దాదాపు 90 శాతం మంది NEETలో ఉత్తీర్ణులు కాలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం తెలిపారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు. ‘‘మెడిసిన్ చదివేందుకు భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాలకు..

మెడిసిన్ చదివేందుకు ఫారిన్ వెళ్లే భారతీయుల్లో 90 శాతం వాళ్లే: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల్లో దాదాపు 90 శాతం మంది NEETలో ఉత్తీర్ణులు కాలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం తెలిపారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు. ‘‘మెడిసిన్ చదివేందుకు భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాలకు ఎందుకు వెళ్తున్నారనే అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. 


ఇక.. రష్యా యుద్ధానికి నిరసన తెలుపుతూ ఐకరాజ్యసమితి భద్రతా మండలి ముందుకొచ్చిన తీర్మానంపై భారత్‌ ఓటు వేయని కారణంగానే.. ఉక్రెయిన్‌లోని భారతీయులపై దాడులు జరుగుతున్నాయా  అన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఆ వార్తల్లోని నిజానిజాలను ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. ఖార్కివ్, కీవ్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అవస్థలు పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి పేర్కొన్నారు. అక్కడున్న వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని, ఈ విషయమై ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.  


ఒకానొక అంచనా ప్రకారం.. మెడిసిన్ చదివేందుకు విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్‌లనే ఎంచుకుంటున్నారు. వీరిలో చైనా వాటా దాదాపు 20 శాతం. ఆ దేశాల్లో ఆరేళ్ల పాటు చదువుకు అయ్యే మొత్తం ఖర్చు దాదాపు రూ. 35 లక్షలు. యూనివర్శిటీ ఫీజులు, కోచింగ్, వసతి, భోజనం ఖర్చులు, చివర్లో జరిగే స్క్రీనింగ్ పరీక్ష వంటివన్నీ ఈ మొత్తంలోనే పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగి రావచ్చు. దీంతో పోలిస్తే.. భారత్‌లోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కేవలం ట్యూషన్ ఫీజులే 55 లక్షల వరకూ ఉంటాయి. ఇక ప్రతి ఏటా 20 నుంచి 25 వేల మంది భారతీయులు మెడిసిన్ చదివేందుకు విదేశాలకు వెళుతుంటారు. ఇక భారత్‌లో మెడిసిన్ చదవాలంటే ముందుగా NEETలో ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో మొత్తం 90 వేల పైచిలుకు సీట్ల కోసం ఏటా 8 లక్షల పైచిలుకు మంది పోటీ పడుతుంటారు. మొత్తం మెడికల్ సీట్లలో దాదాపు సగం ప్రభుత్వ కాలేజీ పరిధిలోవి కాగా.. మిగతావి ప్రైవేటు మెడికల్ సీట్లు. ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటాతో పాటూ ఎన్నారై, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. విదేశాల్లో మెడిసిన్ చదువుకున్న వారు భారత్‌లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్(ఎఫ్‌ఎమ్‌జీఈ) పరీక్షలో ఉత్తీర్ణులైతేనే దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది.

Updated Date - 2022-03-02T00:34:11+05:30 IST