కంచే చేను మేసే...

ABN , First Publish Date - 2021-07-18T07:08:51+05:30 IST

కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన ప్రత్యేక అధికారులు ఇష్టారాజ్యంగా పంచాయతీ నిధులను స్వాహా చేశారు.

కంచే చేను మేసే...
కారంచేడు పంచాయతీ కార్యాలయం నిరసన చేపట్టిన సర్పంచ్‌ శివపార్వతి

కారంచేడు పంచాయతీలో భారీ కుంభకోణం

రూ.90 లక్షలకుపైగా అవకతవకలు

బ్యాంక్‌ల ద్వారా సిబ్బంది ఖాతాల్లోకే నగదు జమ

రూ.లక్షల్లో ఇంటి పన్ను వసూలు

ప్రభుత్వ ఖాతాలో జమచేయని వైనం

నిధుల స్వాహాపై సర్పంచ్‌ నిరసన

పర్చూరు, జూలై 17: కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన ప్రత్యేక అధికారులు ఇష్టారాజ్యంగా పంచాయతీ నిధులను స్వాహా చేశారు. ఇందుకు కారంచేడు గ్రామ పంచాయతీనే నిదర్శనం. పాలకవర్గం లేకపోవటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే ఇదే అవకాశంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే లక్షలాది పంచాయతీ నిధులను కాజేశారు. సర్పంచ్‌ శివపార్వతి కథనం మేరకు.. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలనలో కారంచేడు పంచాయతీలో దాదాపు రూ.90లక్షల నిధులు గోల్‌మాల్‌ జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా తప్పుడు బిల్లులతో నిధులు మళ్ళించారనే ఆరోపణలు ఉన్నాయి.. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను అఽభివృద్ధి పనుల పేరుతో మండల పరిషత్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాతాలో నిధులు జమ చేశారని తెలుస్తోంది. అలాగే శానిటరీ మేస్త్రీ ఖాతాలోకి రూ.31లక్షలకుపైగా మళ్లించారు. పారిశుధ్య కార్మికులు, చెరువు కాపాలాదారుడు, స్వీపర్ల ఖాతాలో సైతం రూ.లక్షల్లో జమ చేసి బొక్కేశారు. కొద్ది నెలల క్రితం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా శివపార్వతి ఎన్నికయ్యారు. ఆమె అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు, మినిట్‌ బుక్స్‌, అజెండా అంశాలకు బిల్లులు ఇవ్వాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని కోరగా అతను అదుగోఇదిగో అంటూ ముఖం చాటేస్తున్నారు. లక్షల  నిధులను ఆన్‌లైన్లో జీతాలు చెల్లించినట్లు చూపి అవకతవకలకు పాల్పడ్డారని సర్పంచ్‌ ఆరోపిస్తున్నారు.


నిబంధనలు తుంగలో తొక్కి...

పంచాయతీ నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్‌ శాఖ ఏఈలు నిర్వహించాల్సి ఉండగా మండల పరిషత్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ పేరుతో చేపట్టి నిఽధులు డ్రా చేశారు. గ్రామపంచాయతీ పర్మినెంట్‌ ఉద్యోగులకు, జీతభత్యం నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్‌ సిబ్బంది వేతనాలు సైతం వారి వారి ఖాతాల్లోకి జమ చేయాలి. కానీ అవేమీ పట్టనట్లుగా శానిటరీ మేస్త్రీ పేరుతో నిధులను డ్రా చేశారు. 


ట్రెజరీలో సైతం మేనేజ్‌...

అన్నీ సక్రమంగా ఉన్నా, అది లేదు ఇది లేదంటూ కొర్రీలు పెట్టే ట్రెజరీ అధికారులు సైతం ప్రత్యేక స్వాహా కార్యక్రమంలో పాత్ర పోషించటం గమనార్హం. ప్రతి బిల్లును పరిశీలించి ఆమోదించాల్సిన సబ్‌ ట్రెజరీ అధికారులు ప్రభుత్వ అధికారి పేరుతో అభివృద్ధి చేసినట్లు బిల్లు అందిస్తే వాటిని తిరస్కరించకుండా ఎంచక్కా ఆమోదించటం అనేక అనుమానాలకు తావిస్తోంది.


లక్షల్లో.. ఇంటి పన్ను వసూలు 

గ్రామపంచాయతీకి సంబంధించి ఇంటి పన్నులు, ఇతర పన్నులు లక్షల్లో వసూలు చేసిన అధికారులు నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాది రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తున్నా అధికారులు మాత్రం ప్రభుత్వ ఖాతాలో జమచేయటం లేదు. 


నిధుల గోల్‌మాల్‌ ఇలా...

నిబంధనలకు విరుద్ధంగా 2020-21 సంవత్సరానికి సంబంధించి మండల పరిషత్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ 010 పద్దు కింద జీతం పొందుతున్న ఓ అధికారిణి ఖాతాలోకి  రూ.11,15,731ను జమ చేసినట్లు సమాచారం. అదేవిధంగా అదే పద్దు కింద మరో బిల్‌ కలెక్టర్‌ పేరు మీద 2019-20లో కాంట్రాక్టు పనిచేసినట్లు అతని ఖాతాలోకి రూ.24,51,135 జమ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా శానిటరీ మేస్ట్రీ ఖాతాలో 2020-21కిగాను కాంట్రాక్టు పనుల నిమిత్తం స్వీపర్ల జీతాల పేరుతో రూ.31లక్షలకు పైగా జమచేశారు. ఇలాంటి అవకతకలు అనేకం ఉన్నాయని సర్పంచ్‌ ఆరోపిస్తున్నారు. 


పంచాయతీ ఎదుట సర్పంచ్‌ నిరసన...

గ్రామ పంచాయితీకి సంబఽంధించిన రికార్డులు, మెజర్‌మెంట్‌ బుక్స్‌(ఎంబీలు), పాలనాపరమైన పుస్తకాలు చూపించాలని శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్‌ శివపార్వతి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆధారాలతో సహా మండల జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు మాసాలకుపైగా రికార్డులు చూపించాలని అడిగినా అధికారులు ఎలాంటి సమాధానం చెప్పటం లేదని, రికార్డులు చూపించాలని బైఠాయించారు. 


అవకతవకలపై విచారణ చేపట్టాలి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్‌

కారంచేడు పంచాయతీలో వస్తున్న ఆరోపణలపై తక్షణమే విచారణ చేపట్టాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్‌ చేశారు. శనివారం కారంచేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వార్డుసభ్యులు అధికారుల తీరుపై నిరసన నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌, పాలకవర్గానికి రికార్డులు చూపించక పోవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  


ఫిర్యాదు చేసినమాట వాస్తవమే:

విజయలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీవో

గ్రామపంచాయతీలో అక్రమాలు జరిగాయంటూ కారంచేడు సర్పంచ్‌ శివపార్వతి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. అవినీతి జరిగిందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. 


Updated Date - 2021-07-18T07:08:51+05:30 IST