9ఏళ్ల నాటి పోస్టర్‌ సాయంతో కన్నవారి చెంతకు!

ABN , First Publish Date - 2022-08-08T06:08:27+05:30 IST

అది 2013, జనవరి 22. ఏడేళ్ల పూజ తన సోదరుడితో కలిసి రోజూలాగే ముంబైలోని అధేరీలోని తన పాఠశాలకు వెళ్లింది. అయితే.. ప్రతిరోజులా ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి..

9ఏళ్ల నాటి పోస్టర్‌ సాయంతో  కన్నవారి చెంతకు!

ముంబైలో 2013లో అపహరణకు గురైన బాలిక

ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న వైనం


ముంబై, ఆగస్టు 7: అది 2013, జనవరి 22. ఏడేళ్ల పూజ తన సోదరుడితో కలిసి రోజూలాగే ముంబైలోని అధేరీలోని తన పాఠశాలకు వెళ్లింది. అయితే.. ప్రతిరోజులా ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆమె గురించి తల్లిదండ్రులు వెతకని చోటంటూ లేదు. వందలాది పోస్టర్లను ముద్రించి నగరమంతా అంటించారు. ఇంటర్నెట్‌లోనూ ప్రచారం చేయించారు. ఫలితం లేకపోయింది. ఇక తమ బిడ్డ దక్కే అవకాశాలు లేవని భావించి ఆ తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు.


ఆరోజు ఏం జరిగింది..?

ముంబైలో నివాసముండే హెన్రీ జోసెఫ్‌ డిసౌజా దంపతులకు పిల్లలు లేరు. దీంతో ఎవరినైనా అపహరించి తెచ్చి పెంచుకోవాలన్న ఆలోచన హెన్రీకి వచ్చింది. అనుకున్నదే తడవుగా సమీపంలోని పాఠశాలకు వెళ్లాడు. అప్పుడే అటుగా వస్తున్న పూజను పిలిచాడు. ఐస్‌క్రీమ్‌ ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. అనంతరం బాలికను అపహరించి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఎవరైనా గుర్తుపడతారన్న భయంతో ఆమెను బెంగళూరులో ఓ హాస్టల్లో చేర్పించాడు. ఆమె పేరును కూడా ఆనీ డిసౌజాగా మార్చారు. ఇది జరిగిన కొన్నేళ్లకు హెన్రీ దంపతులు తల్లిదండ్రులయ్యారు. దీంతో పూజపై వారికి అయిష్టం మొదలైంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చి పనిమనిషిగా చేశారు. ఆ చిన్నారిని చిత్రహింసలు పెట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయ్యాయి.




పూజకు 16ఏళ్లు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం.. మద్యం మత్తులో జోగుతున్న సమయంలో హెన్రీ, పూజ తమ బిడ్డ కాదన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే.. వివరాలను అతడు పూర్తిగా చెప్పకపోవడంతో పూజ ఇంటర్నెట్‌ను ఆశ్రయించింది. ‘పూజ మిస్సింగ్‌’ అన్న పేరిట పోస్టర్లను వెతికింది. ఈక్రమంలో 2013కు చెందిన ఓ పోస్టర్‌ ఆమెను ఆకర్షించింది. అందులోని ఐదు నెంబర్లకు ఫోన్‌ చేసింది. తొలి నాలుగు నెంబర్లను ఇప్పుడెవరూ వాడటం లేదు. ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో చివరి నెంబర్‌కు ఫోన్‌ చేసింది. అదృష్టవశాత్తూ ఆ నెంబర్‌ ఇంకా పనిచేస్తోంది. అది పూజ సొంత ఇంటికి పొరుగున ఉండే రఫీక్‌ అనే అతడి ఫోన్‌ నెంబరు. ఆమె ఫోన్‌ చేసిన అనంతరం పూజ తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తిన రఫీక్‌, ఒక వీడియో కాల్‌ చేశాడు. ఆ కాల్‌లో తమ బిడ్డను గుర్తించిన పూజ తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేవు, పూజ సైతం కన్నవారిని చూసి భావోద్వేగానికి గురైంది. వెంటనే ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం, వారు వచ్చి పూజను తల్లిదండ్రుల వద్దకు చేర్చి హెన్రీ దంపతులను అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. తమకు పిల్లలు లేకపోవడం వలనే పూజను అపహరించామని హెన్రీ పోలీసుల వద్ద అంగీకరించాడు. వివిధ సెక్షన్ల కింద హెన్రీ దంపతులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-08-08T06:08:27+05:30 IST