చిట్టి చేతులు ఊపిరి పోస్తున్నాయి!

ABN , First Publish Date - 2021-05-06T05:30:00+05:30 IST

సాటి మనుషులు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి వయసుతో, ఆర్థిక స్థోమతతో సంబంధం లేదని రుజువు చేస్తోంది లిసిప్రియ కంగుజం. అతి పిన్నవయస్కురాలైన పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపు పొందిన ఈ తొమ్మిదేళ్ళ మణిపురి అమ్మాయి...

చిట్టి చేతులు ఊపిరి పోస్తున్నాయి!

సాటి మనుషులు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి వయసుతో, ఆర్థిక స్థోమతతో సంబంధం లేదని రుజువు చేస్తోంది లిసిప్రియ కంగుజం. అతి పిన్నవయస్కురాలైన పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపు పొందిన ఈ తొమ్మిదేళ్ళ మణిపురి అమ్మాయి... ప్రస్తుత కరోనా విలయంలో ఆక్సిజన్‌ అందక అల్లాడుతున్నవారికోసం సొంత డబ్బుతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొని అందిస్తోంది. మరింతమందికి సాయం అందించడానికి విరాళాలు సేకరిస్తోంది. ‘ప్రియమైన ప్రపంచమా! దేశానికి ఆక్సిజన్‌ కావాలి! దయచేసి సాయం చెయ్యి’ అంటూ లిసిప్రియ ఇచ్చిన పిలుపు ఎంతో మందిని కదిలిస్తోంది. 


‘‘మనం చేసే చిన్న సాయాలే చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి’’ అంటుంది లిసిప్రియ కంగుజం. ఆమె ప్రపంచంలోనే అతిపిన్న పర్యావరణ ఉద్యమకారిణి. పర్యావరణ మార్పులపై చట్టం తీసుకురావాలంటూ రెండేళ్ళ కిందట పార్లమెంట్‌ ఎదుట ఆమె చేసిన ఆందోళన మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకుంది. ప్రస్తుతం కొవిడ్‌ సోకి, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్నవారికి ఊపిరి అందించడానికి తనవంతు సాయానికి ముందుకొచ్చింది. సొంత డబ్బుతో వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేసింది. 




నాలుగేళ్ళ వయసులోనే...

లిసిప్రియది మణిపురి రాష్ట్రంలోని బషిఖోంగ్‌ ప్రాంతం. ఆమె తండ్రి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో దెబ్బతిన్న కుటుంబాల కోసం విరాళాలూ, సహాయక సామగ్రి సేకరణలో ఆయన పాలుపంచుకున్నారు. తండ్రి వెంట లిసిప్రియ కూడా వెళ్ళింది. ‘‘వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు అనే మాటలు తొలిసారిగా అప్పుడే విన్నాను’’ అంటుందామె. అప్పటికి ఆమె వయసు నాలుగేళ్ళే! ఆ తరువాత, మంగోలియాలో జరిగిన ఐక్యరాజ్యసమితి విపత్తు సదస్సుకు హాజరయింది. అక్కడ ప్రసంగాలు విన్నాక ఆమె సంకల్పం మరింత బలపడింది. మన గ్రహాన్ని కాపాడుకోవాలన్న ఆమె విజ్ఞాపన ప్రపంచాన్ని ఆకర్షించింది. భారత పర్యావరణ మార్పుల చట్టం తీసుకురావాలంటూ ప్రధాని మోదీపై ఒత్తిడి చెయ్యడానికి పార్లమెంట్‌ ఎదుట 2019 జూన్‌లో ఆమె ఆందోళన చేసింది. అదే ఏడాది ఆగస్టులో ఆమెకు ‘వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌’ లభించింది. కిందటి ఏడాది అక్టోబర్‌లో ఎర్త్‌ డే నెట్‌ వర్క్‌’ సంస్థ ఆమెకు ‘రైజింగ్‌ స్టార్‌’ బిరుదు ఇచ్చింది. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ‘ది ఛైల్డ్‌ మూవ్‌మెంట్‌’ను లిసిప్రియ ప్రారంభించింది. ఇప్పటి వరకూ 21 దేశాల్లో ఆమె పర్యటించింది. తన ఉద్యమంలో భాగంగా అనేక అంతర్జాతీయ వేదికలపై గళం విప్పింది. కర్బన ఉద్గారాలు తగ్గించాలనీ, జీవవైవిధ్యాన్ని కాపాడాలనీ, అప్పుడు మాత్రమే భూగ్రహం సురక్షితంగా ఉంటుందనీ నినదిస్తోంది. వాతావరణ మార్పును పాఠ్యాంశాల్లో భాగం చెయ్యాలన్నది ఆమె ప్రధాన డిమాండ్‌. స్వీడన్‌కు చెందిన మరో బాల పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌తో ఆమెను పోలుస్తారు. ‘గ్రెటా ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తూంటారు. అయితే తనను గ్రెటాతో పోల్చడం ఇష్టం ఉండదంటుందామె. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది తన ఆశయం అని చెప్పే లిసిప్రియ ఇప్పుడు ఆక్సిజన్‌ అందని కొవిడ్‌ బాధితులకు అందరూ అండగా నిలవాలని కోరుతోంది. 

‘‘నేను దాచుకున్న డబ్బుతో మొత్తం వంద కాన్సన్‌ట్రేటర్లకు ఆర్డర్‌ ఇచ్చాను. కొద్ది రోజుల్లోనే... తొలి విడతగా పది కాన్సన్‌ట్రేటర్లు భారత్‌కు వస్తాయి. ఒక్కో దానిలో 5 లీటర్ల ఆక్సిజన్‌ ఉంటుంది. రవాణా ఖర్చులతో కలిసి వీటి ఖరీదు ఒక్కొక్కటీ రూ.50వేలు అవుతుంది’’ అని ఆమె చెబుతోంది. 


తైవాన్‌ నుంచి సాయం...

అంతేకాదు, భారత్‌లో విలయం సృష్టిస్తున్న కరోనాను ఎదుర్కోవడంలో సాయపడాలంటూ తైవాన్‌ ప్రభుత్వాన్ని ఆమె కోరింది.. తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వూను ప్రత్యేకంగా అభ్యర్థించింది. దీనిపై జోసెఫ్‌ స్పందిస్తూ ‘‘భారత్‌నూ, ఆ దేశానికి చెందిన అద్భుతమైన ప్రజలనూ దైవం దీవించాలి. సాయం చెయ్యడానికి మేం ఎంతో శ్రమిస్తున్నాం’’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ఆమె ధన్యవాదాలు చెబుతూ, భారతదేశానికి ప్రస్తుతం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల అవసరం చాలా ఉందని పేర్కొంది. అదే రోజున (ఏప్రిల్‌ 29) తైవాన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. నూట యాభై ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు పంపిస్తున్నట్టు తెలిపింది. మరింత సాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ‘‘బాధితులను వీలైనంత ఆదుకోవడానికి... నేను అందుకున్న పురస్కారాల నుంచి కూడా నిధులను సమీకరిస్తున్నాను. ప్రస్తుత సంక్షోభంలో 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఏమూలకీ సరిపోవని తెలుసు. మరిన్ని కొనుగోలు చేయడానికి సాయం చెయ్యండి. భారత్‌ మృత్యుముఖంలో ఉంది. ఆక్సిజన్‌ కొరతవల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రజలు తమకు వీలైనంత సాయం చేస్తే వేలాది ప్రాణాలు కాపాడవచ్చు’’ అంటూ లిసిప్రియ చేస్తున్న విజ్ఞప్తి ఎందరినో ఆలోచింపజేస్తోందనడంలో సందేహం లేదు. 




మెయిల్‌ బాక్స్‌లు నిండిపోతున్నాయి...

‘‘సునామీలా ముంచేస్తున్న కొవిడ్‌ కారణంగా నా దేశం మానవాళి చరిత్రలోనే అతిదారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీలైనన్ని ప్రాణాలను కాపాడడానికి మరిన్ని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు తక్షణమే కావాలి. ఇదే విషయాన్ని నేను నా ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించాను. కొద్ది గంటల్లోనే తమకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అవసరమంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది ప్రజల నుంచి విజ్ఞాపనలు వచ్చాయి. నా మెయిల్‌ బాక్సులు నిండిపోతున్నాయి. చాలామంది పిల్లలూ, వయోధికులూ ఆక్సిజన్‌ అందక మరణిస్తున్నారు. కొందరు పిల్లలు ఇప్పటికే తల్లితండ్రులిద్దరినీ పొగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ ప్రభుత్వాలే చెయ్యాలని ఎదురు చూడలేం. దయచేసి నాతో చెయ్యి కలపండి. ప్రాణాలను కాపాడదాం.’’ 


Updated Date - 2021-05-06T05:30:00+05:30 IST