9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-04-17T05:06:58+05:30 IST

ఓబులవారిపల్లె మండలం శివాజీనగర్‌ గ్రామ పరిధిలోని గనిగట్టు వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించి 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లను చూపుతున్న టాస్క్‌ఫోర్సు అధికారులు, సిబ్బంది

9 దుంగలు...రూ.21 వేలు స్వాధీనం


రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 16: ఓబులవారిపల్లె మండలం శివాజీనగర్‌ గ్రామ పరిధిలోని గనిగట్టు వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించి 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శుక్ర వారం రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్సు కార్యాలయం వద్ద తిరుపతి టాస్క్‌ఫోర్సు డీఎస్‌పీ వీవీ గిరిధర్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతపురం రేంజి డీఐజీ క్రాంతిరాణా టాటా ఆదేశాల మేరకు తనతో పాటు తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ జి.మురళీధర్‌ల ఆధ్వర్యంలో రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్సు ఆర్‌ఐ కె.కృపానంద, సిబ్బంది రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, కన్నెగుంట, ఉర్లగట్టుపోడు, శివాజీనగర్‌ తదితర గ్రామాల్లో కూంబింగ్‌ నిర్వహించామని తెలిపారు. ఓబులవారిపల్లె మండలం శివాజీనగర్‌ గ్రామ పరిధిలోని గనిగట్టు వద్ద స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరళిస్తుండగా దాడి చేసి 9 మందిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 9 ఎర్రచందనం దుంగలను, రూ.21వేలు నగదు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓబులవారిపల్లె మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన డేగల పెంచలయ్య, వెలుగు మునె య్య, కనతల శివప్రసాద్‌, పసుపులేటి శివక్రిష్ణ, గురకల చంద్రమౌళి, గిలకపాటి పోలయ్య, తోమల మధు, నచ్చుకూరి బాబు అనే స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వివరించారు. తిరుపతి టాస్క్‌ఫోర్సు సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. రైల్వేకోడూరు మండలంలోని కె.బుడుగుంటపల్లెకు చెందిన శ్రీను అలియాస్‌ పంచ శ్రీను పరారీలో ఉన్నారని తెలిపారు. స్మగ్లింగ్‌లో బెంగుళూరుకు చెందిన స్మగ్లర్‌ ఇమ్రాన్‌ హస్తం ఉందని పట్టుబడిన వారు విచారణలో వెల్లడించారని తెలిపారు.  

ఐదు దుంగలు స్వాధీనం...  

ఓబులవారిపల్లె మండలంలోని గాదెల ఎస్టీకాలనీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు దాడులు చేసి 5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని, స్మగ్లర్‌ మురళిని అరెస్టు చేసినట్లు రైల్వేకోడూరు సీఐ ఆవుల ఆనందరావు తెలిపారు.  దుంగల విలువ రూ.4లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఓబులవారిపల్లె ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:06:58+05:30 IST