40 పౌండ్ల కుక్కని గుటుక్కుమనిపించేసి.. ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయిన మొసలి!

ABN , First Publish Date - 2022-06-20T00:14:49+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మొసలి 40 పౌండ్ల బరువున్న ఓ పెంపుడు శునకాన్ని గుటుక్కుమనిపించేసి

40 పౌండ్ల కుక్కని గుటుక్కుమనిపించేసి.. ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయిన మొసలి!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మొసలి 40 పౌండ్ల బరువున్న ఓ పెంపుడు శునకాన్ని గుటుక్కుమనిపించేసి ఏమీ ఎరుగని నంగనాచిలా ఎంచక్కా వెళ్లిపోయింది. ఈ నెల మొదట్లో జోషువా వెల్స్ అనే వ్యక్తి లంచ్ అనంతరం టోబీ అనే తన 40 పౌండ్ల లాబ్రాడార్ రిట్రీవర్ (శునకం)ను వాకింగ్ కోసం తల్లాహస్సీలోని ప్రసిద్ధ పార్క్ అయిన జేఆర్ అల్‌ఫోర్డ్ గ్రీన్ ట్రయల్‌కు వెళ్లారు. 


వాటర్ వే పక్క నుంచి నడుస్తూ వెళ్తుండగా 9 అడుగుల పొడవున్న ఓ మొసలి గబుక్కున వారిపై దాడి చేసి శునకాన్ని నోట కరుచుకుని నీళ్లలోకి తీసుకెళ్లింది. స్పందించే సమయం కూడా లేనంత వేగంగా ఈ ఘటన జరిగినట్టు వెల్స్ పేర్కొన్నారు. ‘‘నీటిలో పేలుడు జరిగినట్టు అనిపించింది’’ అని ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు వెల్స్ తెలిపారు. అసలక్కడ ఏమీ జరగనట్టే మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆయన పేర్కొన్నారు. 


తన కుటుంబ పెంపుడు శునకమైన టోబీని రక్షించుకునేందుకు నీళ్లలోకి దూకాలని అనుకున్నానని, కానీ దాని ఆకారం చూసి భయపడి వెనక్కి తగ్గినట్టు చెప్పారు. జూన్ 9న ఈ ఘటన జరిగింది. ఆ మొసలి 9 అడుగుల 2 అంగుళాల పొడవున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ వాటర్ వేలో శునకం అవశేషాలను అధికారులు గుర్తించారు.  ఘటన సమయంలో వెల్స్ తన శునకాన్ని పట్టుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు పార్క్ అధికారులు తెలిపారు. ఇకపై ఇక్కడికొచ్చి నీటికి దగ్గరగా నడిచేవారు తమ పెంపుడు జంతువులను పట్టుకుని నడవాలని అధికారులు కోరారు. 

Updated Date - 2022-06-20T00:14:49+05:30 IST