గరిష్ఠంగా 8% క్షీణత

ABN , First Publish Date - 2020-05-27T06:41:29+05:30 IST

కరోనా ధాటికి దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు కుదేలయ్యాయి. బ్లూచిప్‌ కంపెనీలకూ కొవిడ్‌ సెగ గట్టిగానే తాకింది.

గరిష్ఠంగా  8% క్షీణత

  • 2020-21లో సెన్సెక్స్‌ కంపెనీల రాబడి పరిస్థితి 
  • 2021-22లో ఆదాయం 17ు వరకు పతనం 
  • కరోనా సంక్షోభం, ఉద్దీపనలపైనే ఇన్వెస్టర్ల దృష్టి
  • బోఫా సెక్యూరిటీస్‌ ఇండియా స్ట్రాటజిస్ట్‌ అమిష్‌ షా 


ముంబై: కరోనా ధాటికి దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు కుదేలయ్యాయి. బ్లూచిప్‌ కంపెనీలకూ కొవిడ్‌ సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల ఆదాయం 8 శాతం వరకు తగ్గవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బోఫా) సెక్యూరిటీస్‌ ఇండియా స్ట్రాటజిస్ట్‌ అమిష్‌ షా అంచనా వేశారు. అయితే, ఈ కంపెనీల ఈక్విటీ విలువ పెరుగుదల అవకాశాలు.. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదా ప్రభుత్వ ఉద్దీపనలతో ముడిపడి ఉన్నాయన్నారు.


కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికా, సింగపూర్‌ సహా ప్రపంచంలోని చాలా దేశాలు భారీ స్థాయి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయని, భారత్‌ ఇంకా ప్రకటించాల్సి ఉందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు -5 శాతం వరకు క్షీణించే అవకాశాలున్నాయని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేశాయి. ఈసారి వృద్ధి మైన్‌సలోకి పతనం కానుందని ఆర్‌బీఐ సైతం హెచ్చరించింది. షా ఇంకా ఏమన్నారంటే.. 


  1. సెన్సెక్స్‌ కంపెనీల రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో 7-8 శాతం మేర తగ్గవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో 17 శాతం వరకు పతనమయ్యే అవకాశం ఉంది 
  2. స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు దూసుకెళ్లేందుకు ఏదో ఒక సానుకూల కారణం కావాలి. కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు సానుకూలంగా పరిణమించే అవకాశాలు ఇప్పట్లో కన్పించడం లేదు. కరోనా కేసుల హెచ్చుతగ్గులు, కార్పొరేట్‌ రంగం కోసం ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపనలపై మార్కెట్‌ ప్రధానంగా దృష్టిసారించనుంది 
  3. కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రభుత్వం ఉద్దీపనలందిస్తే మార్కెట్లో డిమాండ్‌ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండూ జరగకపోతే, ఇన్వెస్టర్లు ఐటీ, టెలికాం, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ వంటి భద్రమైన రంగ కంపెనీల షేర్లలోకి పెట్టుబడులు మళ్లించే అవకాశం ఉంది. 
  4. ప్రస్తుతం భారత సూచీలతో పోలిస్తే ఇతర దేశాల ఈక్విటీ మార్కెట్ల పనితీరే బాగుంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ఊరట ప్యాకేజీపై మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే పెదవి విరిచాయి. 

Updated Date - 2020-05-27T06:41:29+05:30 IST