Abn logo
Jul 12 2020 @ 12:26PM

8డి మ్యాజిక్‌

మ్యూజిక్‌ వింటే మైమరచిపోతాం.. అయితే ఈ 8డి మ్యూజిక్‌ వింటే మాత్రం డ్యాన్స్‌ చేయకుండా ఆగలేం. సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఆ కొత్త ట్రెండ్‌ గురించి..  


ఒక పెద్ద థియేటర్‌. చుట్టూ భారీ సౌండ్‌బాక్స్‌లు. వన్‌.. టు.. త్రీ.. మ్యూజిక్‌ స్టార్ట్‌. అప్పుడొచ్చే మజా ఉంటుంది చూడూ.. వింటే కానీ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఈ కరోనా టైమ్‌లో ఆ అవకాశం ఎక్కడుందీ? అంటారు మీరు. ఏం ఫర్లేదు. చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయర్‌ఫోన్లు ఉంటే చాలు. యూట్యూబ్‌లోకెళ్లి 8డి మ్యూజిక్‌ ఆన్‌ చేయండి.. మీ మూడ్‌ క్షణాల్లో మారిపోతుంది.. 


సాధారణంగా సంగీతాన్ని చెవులతో వింటాం. కానీ ఈ నయా టెక్నాలజీలో తలచుట్టూ సంగీతం తరంగాలుగా తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుంది. దీంతో ఇది ‘మెదడు వినే మ్యూజిక్‌’లా ప్రాచుర్యం పొందింది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ఉర్రూతలూగించే పాటలెన్నో ఇప్పుడు 8డి ఎఫెక్ట్‌తో ఊపేస్తున్నాయి. 


‘శిశుర్వేత్తి.. పశుర్వేత్తి. వేత్తిగాన రసం ఫణి’ శిశువులు, పశువులు, పాములు... సమస్త జీవులూ సంగీతానికి స్పందిస్తాయి. సంగీతం మానవ జీవితంలో భాగం. అయితే కాలానుగుణంగా మ్యూజిక్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో భాగమే తాజా సంచలనం ‘8డి’.

ఇప్పుడంతా స్మార్ట్‌ యుగం. సాంకేతికతే అన్ని రంగాలకు మూలం. మ్యూజిక్‌లోనూ టెక్నాలజీదే హవా. మీరు గనక సంగీత అభిమాని అయితే, యూట్యూబ్‌లో 8డి ట్రాక్‌లు వినండి.. రెండేళ్ల కిందట మొదలైన ఈ సరికొత్త సాంకేతికత ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ మ్యూజిక్‌ ట్రాక్స్‌ వింటే అదో లోకంలోకి మైమరచిపోవాల్సిందే! ఒకరకంగా ఆ ట్యూన్స్‌కు తక్షణమే ట్యూన్‌ అవుతాం. అందులో వాడిన సంగీత పరికరాల సవ్వడికి ఫిదా కాకుండా ఉండలేం. తెరలుతెరలుగా వీనుల్ని తాకే ఆ శబ్ధ సౌందర్యం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కొత్త అనుభూతిని మిగిల్చుతుంది.


ఏమిటీ 8డి ?

సాధారణంగా ఏదైనా ఓ పాటను వింటుంటే అందులోని సంగీతం సిర్థంగా మన చెవులను తాకుతుంది. కానీ 8డిలో అలా కాదు. కుడి నుంచి ఎడమకు... పై నుంచి కిందకు... తల చుట్టూ ఇలా అన్ని దిశల నుంచి సంగీతం వినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. అందుకే 8డి ట్రాక్స్‌లో పాటల్ని వినాలంటే హెడ్‌ఫోన్స్‌ తప్పనిసరి. లేదంటే ఆ ఎఫెక్ట్‌ తెలియదు. హెడ్‌ఫోన్స్‌తో వింటున్నా బయటి నుంచి వినిపిస్తున్న భావన కలగడం 8డిలోని మరో విశేషం. ఓ గది మధ్యలో ఉన్నట్టు.. మన చుట్టూ సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తున్న భావన కలుగుతుంది. అలా కళ్లు మూసుకుంటే అంతరిక్షంలో తేలియాడుతున్న హాయిని స్ఫురింపజేస్తుంది 8డి ఎఫెక్ట్‌. అయితే ఇలాంటి సంగీతాన్ని వీలైనంత వరకు నిశ్శబ్ద వాతావరణంలో వినాలి. మంచి నాణ్యమైన హెడ్‌ఫోన్స్‌నే వాడాలి. అప్పుడే ఆ మజాను ఆస్వాదించగలుగుతాం. 


3డికి అడ్వాన్సా?

నాటి ‘చిన్నారి చేతన్‌’ నుంచి నేటి ‘రోబో 2.0’ వరకు త్రీడి సినిమాలు మనకు సుపరిచితమే. మరి ఈ 3డికి అడ్వాన్స్‌ వెర్షన్‌ 8డినా? కానేకాదు. త్రీడి అంటే మూడు మితులు. పొడవు, వెడల్పు, ఎత్తు. మన నిత్యజీవితంలో ఉపయోగించే కొలతలివి. అలాగని 8డి కి ఎనిమిది మితులు ఉండవు. ఆమాటకొస్తే అసలు సంగీతానికి ఎలాంటి కొలతలూ ఉండవు. 8డిలో మ్యూజిక్‌ భిన్న దిశల నుంచి వినిపిస్తుంది. హెచ్చు తగ్గులూ ఉంటాయి. అందుకే వినూత్నంగా ఉండేలా ‘8డి’ పేరు సృష్టించారు. అంతకుమించి ఇందులో వేరే లాజిక్‌ లేదు. చిత్రమేమంటే ఈ ఎఫెక్ట్‌ సృష్టికర్తలు ఎవరో కూడా తెలియదు.


ఎలా చేస్తారు?

ప్యానింగ్‌, రివర్బ్‌ ఈ రెండు టెక్నిక్స్‌లే 8డిలో కీలకం. ధ్వని తరంగాలను రెండు వైపులకూ ప్రసారం చేయడాన్ని ప్యానింగ్‌ అంటారు. సంగీతానికి ప్రతిధ్వనిని ప్రభావవంతంగా జోడించడమే రివర్బ్‌. ఈ రెండింటినీ సమంగా మిళితం చేస్తూ.. మ్యూజిక్‌ను ఎడిట్‌ చేయడమే 8డి.


మెదడు వింటోంది

సాధారణంగా సంగీతాన్ని చెవులతో వింటాం. కానీ ఈ నయా టెక్నాలజీలో తలచుట్టూ సంగీతం తరంగాలుగా తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుంది. దీంతో ఇది ‘మెదడు వినే మ్యూజిక్‌’లా ప్రాచుర్యం పొందింది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ఉర్రూతలూగించే పాటలెన్నో ఇప్పుడు 8డి ఎఫెక్ట్‌తో ఊపేస్తున్నాయి. అయితే పేరు 8డినే అయినా ఇది త్రీడి సాంకేతికతే అని వాదించేవారున్నారు. సంగీత దర్శకులు సొంతంగా ఈ టెక్నాలజీని వాడటం లేదనేది మరో విమర్శ. హిట్‌ పాటలను డిజెలుగా మిక్స్‌ చేసినట్లు 8డి కూడా కొంతకాలం నిలిచే కృత్రిమ అనుభూతే అన్నది సంప్రదాయవాదుల అభిప్రాయం. సరే ఏదేమైనా కానీ ప్రస్తుతం కాసేపు కరోనా భయాల్ని పక్కన పెట్టండి. ఓసారి నెట్టింట్లోకి వెళ్లి 8డి మీట నొక్కండి. ‘ముక్కాలా... ముకాబ్‌లా’ అంటూ వచ్చే ఫాస్ట్‌బీట్‌తో ఊగిపోండి. లేదంటే ‘‘బుల్లిగువా... ఓ బుల్లిగువా’’ అంటూ మంద్రంగా వినిపించే సంగీతంలోనైనా మునిగిపోండి. 8డి ఒక కొత్త మత్తు, సరికొత్త మజా. ఆస్వాదిద్దాం.


- మట్టపల్లి రమేష్‌

Advertisement
Advertisement