89.34 లక్షలు.. తేలిన గ్రేటర్ ఓటర్ల లెక్క..

ABN , First Publish Date - 2022-01-06T16:57:54+05:30 IST

కిందటి సంవత్సరంలో పోలిస్తే అదనంగా 49 వేలకుపైగా కొత్త ఓటర్లు పేర్లు నమోదు...

89.34 లక్షలు.. తేలిన గ్రేటర్ ఓటర్ల లెక్క..

  • సుమారు 40 వేల వరకు పెరుగుదల
  • శివారు నియోజకవర్గాల్లోనే 50 శాతానికిపైగా..
  • కొత్తగా 49 వేల పైచిలుకు నమోదు
  • తొలగించినవి 9700లకుపైనే
  • ఓటర్ల సంఖ్యలో శేరిలింగంపల్లి టాప్‌
  • తొలగింపులో సనత్‌నగర్‌..

హైదరాబాద్‌ సిటీ : మహానగర ఓటర్ల సంఖ్య దాదాపు 40 వేలు పెరిగింది. 2021 తుది జాబితా ప్రకారం గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 88.94 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడా సంఖ్య 89.34 లక్షలకు చేరింది. బుధవారం జిల్లాల వారీగా ఫొటోలతో సహా ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. కిందటి సంవత్సరంలో పోలిస్తే అదనంగా 49 వేలకుపైగా కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకోగా, 9700కుపైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. కుత్బుల్లాపుర్‌లో కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 4533 కాగా, తొలగించిన ఓటర్లు 452. ఇక్కడ అత్యధికంగా 4081 మంది ఓటర్లు పెరిగారు. రాజేంద్రనగర్‌లో 3971, మల్కాజ్‌గిరిలో 3514, మహేశ్వరంలో 3082 మంది ఓటర్లు పెరిగారు. సనత్‌నగర్‌లో అత్యధికంగా 4510 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. అక్కడ కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లు 1038 కాగా, గతేడాదితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3472 తగ్గింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ పరిధిలో ఓటర్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. 973 మంది పేర్ల తొలగింపుతో కంటోన్మెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల సంఖ్య తగ్గింది.


జిల్లాలో 20 వేల మంది.. 

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కిందటి సంవత్సరం 43.53 లక్షల ఓటర్లు ఉండ గా, ఇప్పుడా సంఖ్య 43.67కు పెరిగింది. జిల్లాలో 20,911 మంది పేర్లు కొత్తగా జాబితాలో చేరాయి. 7,447 మంది పేర్లను తొలగించారు. 


శివార్లలో 50 శాతానికిపైగా..

గ్రేటర్‌లోని శివారు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 43.67 లక్షల ఓటర్లు ఉంటే, శివార్లలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 45.67 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎప్పటిలానే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6.64 లక్షల మంది, కుత్బుల్లాపుర్‌లో 6.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 5.57 లక్షలతో ఎల్‌బీనగర్‌, 5.06 లక్షల ఓటర్లతో ఉప్పల్‌, 5.02 లక్షల మంది ఓటర్లతో రాజేంద్రనగర్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహానగరంలోని చార్మినార్‌ నియోజకవర్గంలో 2.18 లక్షలు, కార్వాన్‌లో 2.43 లక్షల మంది అత్యల్ప ఓటర్లు ఉన్నారు. ప్రజలు http://www.nvsp.in/ వెబ్‌సైట్‌లోను, ఈఆర్‌ఓ కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాల్లోను జాబితాలో తమ పేర్లను చెక్‌ చేసుకోవచ్చన్నారు.

Updated Date - 2022-01-06T16:57:54+05:30 IST