‘ఫిన్‌కేర్‌’ దోపిడీ కేసులో 860 గ్రాముల ఆభరణాల స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-05T07:44:25+05:30 IST

శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్‌ బ్యాంకు దోపిడీ కేసులో సోమవారం 860 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

‘ఫిన్‌కేర్‌’ దోపిడీ కేసులో 860 గ్రాముల ఆభరణాల స్వాధీనం
బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

శ్రీకాళహస్తి, జూలై 4: శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్‌ బ్యాంకు దోపిడీ కేసులో సోమవారం 860 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 26వ తేదీన అర్ధరాత్రి ఫిన్‌కేర్‌ బ్యాంకులో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన వన్‌టౌన్‌ సీఐ అంజుయాదవ్‌.. జూన్‌ 2వ తేదీన బ్యాంకు ఆపరేషన్‌ మేనేజరు స్రవంతితోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అదేనెల 9వ తేదీన బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ విఘ్నే్‌షను నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. మళ్లీ ఈనెల 2వ తేదీన ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఫిన్‌కేర్‌బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన సుమారు వెయ్యి గ్రాముల అసలు బంగారాన్ని దొంగలు చేజిక్కించుకున్నారు. వాటి స్థానంలో ఫిన్‌కేర్‌ బ్యాంకులో నకిలీ ఆభరణాలను చేర్చారు. విచారణలో ఈ వెయ్యి గ్రాముల అసలైన బంగారు ఆభరణాలను తిరిగి మూడు ప్రైవేటు సంస్థల్లో తనఖా పెట్టి నగదును తీసుకున్నారు. మూడ్రోజుల కిందట ఈ మూడు సంస్థల మేనేజర్లను అరెస్టు చేయడంతో ఇప్పటి వరకు ఈ కేసులో 12మంది నిందితులుగా తేలింది. ఈ మూడు సంస్థల నుంచి నగలు స్వాధీనం చేసుకునేందుకు మూడ్రోజుల కిందట నోటీసు జారీ చేశారు. ఇందులో భాగంలో ఓ ప్రైవేటు సంస్థలో సోమవారం సీఐ అంజుయాదవ్‌, ఎస్‌ఐ సంజీవకుమార్‌ 860 గ్రామల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు సంస్థల్లో ఉన్న 140 గ్రాములను కూడా త్వరలోనే రికవరీ చేస్తామని సీఐ పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-05T07:44:25+05:30 IST