గ్రేటర్‌లో విద్యుత్‌ బకాయిలు 85 కోట్లు

ABN , First Publish Date - 2021-02-27T17:03:46+05:30 IST

గ్రేటర్‌లో పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు డిస్కంకు గుదిబండగా మారుతున్నాయి...

గ్రేటర్‌లో విద్యుత్‌ బకాయిలు 85 కోట్లు

  • ఎల్‌టీ కేటగిరిలో సౌత్‌ సర్కిల్‌లో అత్యధికంగా రూ. 39 కోట్లు
  • రాజేంద్రనగర్‌, సెంట్రల్‌ సర్కిల్‌లో రూ. 10 కోట్లు
  • లాక్‌డౌన్‌లో భారీగా పడిపోయిన హెచ్‌టీ వినియోగం

గ్రేటర్‌లో పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు డిస్కంకు గుదిబండగా మారుతున్నాయి. ఎల్‌టీ కేటగిరిలో ఫిబ్రవరి మొదటి వారానికే రూ. 85.88 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం పడిపోవడంతో పాటు ఎల్‌టీ కేటగిరిలో వాడిన విద్యుత్‌కు బిల్లులు వసూలు కాకపోవడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పాత బకాయిలపై దృష్టి సారించారు. రెండు నెలలుగా పేరుకుపోయిన బిల్లుల వసూలుకు ప్రతీ వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మార్చి నాటికి పాత బకాయిలు 90 శాతం వసూలు చేయాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


హైదరాబాద్‌ : గ్రేటర్‌ జోన్‌పరిధిలో ఎల్‌టీ కేటగిరిలో 9 సర్కిళ్లలో రూ.85.88 కోట్ల బకాయిలుండగా, అత్యధికంగా సౌత్‌ సర్కిల్‌లో రూ. 39 కోట్లు, హైదరాబాద్‌ సెంట్రల్‌లో రూ. 11 కోట్లు, రాజేంద్రనగర్‌  సర్కిల్‌లో రూ. 10 కోట్లు, సైబర్‌సిటీ సర్కిల్‌లో రూ. 7.44 కోట్లు, హబ్సిగూడలో రూ. 4.67 కోట్ల విద్యుత్‌ బకాయిలున్నాయి. సౌత్‌ సర్కిల్‌లోని బంజారాహిల్స్‌లో రూ. 3.78 కోట్లు, హబ్సిగూడలో రూ.4.67 కోట్లు, మేడ్చల్‌ సర్కిల్‌లో రూ. 3.89 కోట్లు, సికింద్రాబాద్‌లో రూ. 3.8 కోట్లు, సరూర్‌నగర్‌లో రూ. 2.3 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.


లాక్‌డౌన్‌లో హెచ్‌టీ వినియోగం ఢమాల్‌

కొవిడ్‌ నేపథ్యంలో పలు పరిశ్రమలు, కంపెనీలు మూతపడటంతో హెచ్‌టీ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. సినిమా థియేటర్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెరుచుకోకపోవడంతో విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గింది. 2019 ఏప్రిల్‌ నెలలో 661 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదవ్వగా, 2020 ఏప్రిల్‌లో 334 మిలియన్‌ యూనిట్లు నమోదైంది. 2019 మేలో 663 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదవ్వగా, 2020 మేలో 407 మిలియన్‌ యూనిట్లు, 2019 జూన్‌లో 714 మిలియన్‌ యూనిట్లు, 2020 జూన్‌లో 505 ఎంయూల వినియోగం నమోదైంది. 2019 జూలైలో 1290 మిలియన్‌ యూనిట్లు, 2020 జూలైలో 1157 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. 2019 ఆగస్టులో 1366 మిలియన్‌ యూనిట్లు వినియోగం కాగా, 2020 ఆగస్టులో 1155 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. లాక్‌డౌన్‌ కాలంలో హెచ్‌టీ వినియోగం భారీగా పడిపోవడంతో విద్యుత్‌ బిల్లులు తగ్గాయి. 


పెరుగుతున్న డిమాండ్‌

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో విద్యుత్‌ వినియోగం కూడా పెరుగుతోంది. రెండు నెలలుగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో క్రమంగా బిల్లులు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగం మార్చి నుంచి మరింత పెరుగుతుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగితే విద్యుత్‌శాఖకు అంత లాభమని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 46 ఎంయూ నుంచి 50 ఎంయూల విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. మార్చి మొదటి వారం నుంచి 50 - 60 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదయ్యే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో గ్రేటర్‌లో 70 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ చేరుతుందని ఆపరేషన్‌ అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-02-27T17:03:46+05:30 IST