84 లక్షలు ఒక్క రోజులో వేసిన టీకాలివి

ABN , First Publish Date - 2021-06-22T07:11:19+05:30 IST

దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకా పంపిణీ ఘనంగా ప్రారంభమైంది.

84 లక్షలు ఒక్క రోజులో వేసిన టీకాలివి

  • 18 ఏళ్లు పైబడినవారికి ఉచిత వ్యాక్సినేషన్‌ ప్రారంభం
  • కొత్త విధానంలో భాగంగా రికార్డు స్థాయిలో పంపిణీ
  • టీకా పొందినవారిలో 55ు 44 ఏళ్లలోపు వారే: కేంద్రం
  • ఇప్పటివరకు ఇదే అత్యధికం.. గత గరిష్ఠానికి రెట్టింపు
  • బీజేపీ రాష్ట్రాల్లోనే 70ు.. మిగతాచోట్ల పూర్తి భిన్నం
  • ఇవి కళ్లు చెదిరే గణాంకాలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 21: దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకా పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 84 లక్షల మందిపైగా ప్రజలకు వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఏప్రిల్‌ 2న గరిష్ఠంగా 42 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. దానితో పోలిస్తే.. తాజాగా రెట్టింపు సంఖ్యలో టీకాలు వేశారు. మరోవైపు వీరిలో 55 శాతం మంది 18-44 ఏళ్లలోపు వారేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలు సరిపడా అందజేయడంతో యువత భారీగా వచ్చారని పేర్కొంది. కేంద్రీకృత వ్యాక్సినేషన్‌ విధానం సమర్థతకు ఇది నిదర్శమని.. 68 వేలపైగా కేంద్రాల్లో పంపిణీ జరిగిందని వివరించింది.


ఒక్కరోజులో మన దేశంలో వేసిన టీకాలు న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ జనాభాకు సమానమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సవరించిన విధానంలో.. 18 ఏళ్లు పైబడినవారికి టీకాను ఉచితంగా అందించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్పత్తి సంస్థల నుంచి 75 శాతం టీకాలను నేరుగా కొనుగోలు చేస్తోంది. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 50 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యానికి అదనంగానే పంపిణీ జరిగింది. 



బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జోరు

తాజా టీకా పంపిణీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోరుగా సాగింది. 84 లక్షల టీకాల్లో 70 శాతం పైగా ఈ రాష్ట్రాల్లోనే వేశారు. మధ్యప్రదేశ్‌ (16 లక్షలు) టాప్‌లో ఉండగా, కర్ణాటక (10 లక్షలు), ఉత్తర ప్రదేశ్‌ (6.6 లక్షలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  గుజరాత్‌ (5 లక్షలు), హరియాణ (4.7 లక్షలు) గణాంకాలను కలిపితే 50 శాతం టీకాలు ఈ ఐదు రాష్ట్రాల్లోనే వేసినట్లు అవుతోంది. టీకా ఉత్సవ్‌ పేరిట ఈ రాష్ట్రాలు భారీ సంఖ్యలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాయి. లక్ష్యానికి 50 శాతం అదనంగా పంపిణీ చేశాయి.


మరోవైపు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ సాదాసీదాగా సాగింది. మహారాష్ట్రలో 33 లక్షల డోసులున్నా 3.6 లక్షల మందికే టీకా వేశారని కేంద్రం పేర్కొంది. పంజాబ్‌, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఢిల్లీల్లో ఏ రాష్ట్రంలోనూ లక్షకు మించి డోసులు పంపిణీ కాలేదని తెలిపింది. 


ఇవి కళ్లు చెదిరే గణాంకాలు: మోదీ ట్వీట్‌ భారీఎత్తున టీకా పంపిణీని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘ఇవి కళ్లుచెదిరే గణాంకాలు. టీకా తీసుకున్నవారికి అభినందనలు. వేసిన ఆరోగ్య కార్యకర్తలకు అభివందనాలు. శభాష్‌ భారత్‌’’ అని కొనియాడారు. అంతకుముందు వ్యాక్సినేషన్‌ ప్రారంభ సందర్భంగా చేసిన ట్వీట్‌లో ‘‘ఈ విడతలో ప్రధానంగా లబ్ధి పొందేది పేద, మధ్య తరగతి వర్గాలు, యువతే. టీకా తీసుకుంటామని మనందరం ప్రతిజ్ఞ చేయాలి. అందరం కలిస్తేనే కరోనాను ఓడించగలం’’ అని పేర్కొన్నారు.  



88 రోజుల కనిష్ఠానికి కేసులు

దేశంలో కరోనా కేసులు మరింత తగ్గాయి. ఆదివారం 53,256 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత 88 రోజుల్లో ఇవే అత్యల్ప కేసులు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,99,35,221కి చేరింది. వరుసగా 39వ రోజూ రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌ కేసులు తగ్గాయి. వైర్‌సతో 1,422 మంది మృతిచెందారు. కొవిడ్‌ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాదీ అమర్‌నాథ్‌ యాత్ర రద్దయింది. 




మిక్స్‌డ్‌ వ్యాక్సినేషన్‌ బాగానే పనిచేస్తోంది


ఒక కంపెనీ కరోనా వ్యాక్సిన్‌తో మొదటి డోసు.. మరో కంపెనీ దానితో రెండో డోసు ఇవ్వొచ్చా? అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీకా లబ్ధిదారులకు బూస్టర్‌ డోసు అవసరమా? అవసరం లేదా? అనే దానిపై స్పష్టతనిచ్చే సమాచారమేదీ ప్రస్తుతానికి తమకు అందుబాటులో లేదని వెల్లడించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన శాస్త్రీయ అంశాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే ఒక కంపెనీ టీకాతో మొదటి డోసును అందించిన చాలా దేశాలు.. అదే కంపెనీ నుంచి రెండో డోసుకు సరిపడా స్టాక్‌ లభించకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాయని చెప్పారు. ‘హెటెరో లోగస్‌ ప్రైమ్‌ - బూస్ట్‌ కాంబినేషన్‌’గా పిలిచే ఈ తరహా మిక్స్‌డ్‌ వ్యాక్సినేషన్‌ పద్ధతి వివిధ కరోనా వేరియంట్లపై బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.


Updated Date - 2021-06-22T07:11:19+05:30 IST