పింఛను కోసం 82 కి.మీ.

ABN , First Publish Date - 2022-01-02T09:17:30+05:30 IST

పింఛను కోసం 82 కి.మీ.

పింఛను కోసం 82 కి.మీ.

‘నల్లమల’ పెచ్చెర్వు చెంచుల కష్టాలు

కర్నూలు జిల్లా నల్లమల అంతర్భాగంలో ఉన్న పెచ్చెర్వు చెంచులు పింఛన్‌ కోసం రానూపోనూ 82 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. పెచ్చెర్వు చెంచుగూడెంలో 94 కుటుంబాలు ఉన్నాయి. జనాభా 215 మంది. వీరిలో వృద్ధాప్య, వితంతు పింఛన్ల లబ్ధిదారులు 28 మంది. స్థానిక వలంటీరు అర్తి నాగరాజు మానుకోవడంతో మూడు నెలలుగా వీరు పింఛన్ల కోసం 41 కి.మీ. దూరంలో ఉన్న ఆత్మకూరు వచ్చి పింఛన్‌ సొమ్ము తీసుకుంటున్నారు. అటవీ మార్గం సరిగా లేక రాకపోకలకు ఒక్కొక్కరు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. ఒకటో తేదీ కావడంతో శనివారం పింఛన్‌ కోసం పెచ్చెర్వు చెంచులు రెండు ఆటోల్లో ఆత్మకూరు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంపీడీవో కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. అయినా అధికారులు డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకుల్లో డబ్బు లేదని అధికారులు చెప్పారని చెంచులు వాపోయారు. సంబంధిత సచివాలయ సిబ్బంది సాయంత్రం చెంచుల వేలిముద్రలు సేకరించారు. పింఛన్‌ సొమ్ము రాగానే గూడేనికి పంపిస్తామని చెప్పడంతో చెంచులు నిరాశతో తిరుగుపయనమయ్యారు. కాగా, ఇటీవలే కొత్త వలంటీర్‌ను నియమించామని, అతనికి ఇంకా గుర్తింపు రాకపోవడంతో గూడేనికి పంపించడం లేదని ఆత్మకూరు ఎంపీడీవో మోహన్‌కుమార్‌ చెప్పారు. వచ్చే నెల నుంచి గూడెంలోనే పింఛన్‌ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-01-02T09:17:30+05:30 IST