కోల్కతా: మార్చురీలో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎగబడుతున్నారు. కావలసింది ఆరో తరగతి అర్హత అయితే.. ఇంజినీరింగ్ పట్టభద్రులు కూడా వరస కట్టారు. కోల్కతాలోని నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజీ దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 8 వేల మంది ఆసక్తి ప్రదర్శించారు. జీతం నెలకు రూ. 15 వేలు. మొత్తం ఆరు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మెడికల్ కాలేజ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుదారుల్లో 100 మంది ఇంజినీర్లు, 500 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2200 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని మెడికల్ కాలేజ్ అధికారులు తెలిపారు. రాత పరీక్ష కోసం 784 మందిని ఎంపిక చేశామన్నారు. ‘‘ఇంజినీర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవడం మమల్ని ఆశ్చర్యపరిచింది’’ అని మెడికల్ కాలేజ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.