Abn logo
Aug 12 2020 @ 08:51AM

ఇంట్లోనే 80 శాతం రికవరీ.. చికిత్స ఖర్చు రూ.10 వేల లోపే..!

మళ్లీ వృత్తుల్లో చేరిన 70 శాతం మంది 

ఐసొలేషన్‌ చికిత్స ఖర్చు రూ. 5 నుంచి 10 వేల లోపే... 

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ టెలిఫోన్‌ సర్వేలో వెల్లడి


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : కరోనా నిర్ధారణ అనంతరం హోం ఐసొలేషన్‌లో ఉండి వైద్య చికిత్సలు పొందిన వారిలో 80 శాతం మంది రికవరీ అయినట్లు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ చేపట్టిన టెలిఫోన్‌ సర్వేలో వెల్లడైంది. రికవరీ అయిన వారిలో 70 శాతం మంది మళ్లీ ఉద్యోగాల్లో చేరినట్లు తేలిందని ఆ సంస్థ గుర్తించింది. 300 మందిని ఎంపికచేసి పది రోజులపాటు టెలిఫోన్‌ సర్వే నిర్వహించింది. హోం ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో బాధితుల ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్వేను నిర్వహించినట్లు ఆ సంస్థ నిర్వాహకుడు ముజ్‌తబ్‌ హసన్‌ అక్సరీ తెలిపారు.


240 మంది హోం ఐసొలేషన్‌ పూర్తి

ఎంపిక చేసిన 300 మందిలో 240 మంది కోలుకున్నారు. 51 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 9 మందిని ఇంటి నుంచి ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మరణించినట్లు సర్వేలో గుర్తించారు. ఈ రికవరీ రేటులో 30 నుంచి 50 ఏళ్ల లోపు వారు 60 శాతం మంది, 50 నుంచి 80 సంత్సరాల మధ్య 36 శాతం మంది, 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు 14 శాతం మంది ఉన్నారు. ఇందులో 58 శాతం మంది పురుషులు, 42 శాతం మంది మహిళలున్నారు. 


నెగెటివ్‌ వచ్చినా శ్వాస ఇబ్బందులు

వైరస్‌ వచ్చిన వారిలో 5 శాతం మంది బరువు తగ్గారు. మరో 8 శాతం మంది పోస్టు రికవరీ దశలో బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మరో 3 శాతం నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. చికిత్స అనంతరం నెగెటివ్‌ వచ్చినా ఇంకా శ్వాస తీసుకోవడంలో 2 శాతం మంది ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తెలిపారు. ఉపశమనం కోసం ఆక్సిజన్‌ థెరపీ తీసుకున్నట్లు బాధితులు వివరించారు. 


విధి నిర్వహణలో నిమగ్నం

హోం ఐసొలేషన్‌ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతుపై 85 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. నెగెటివ్‌ వచ్చిన తర్వాత 70 శాతం మంది పురుషులు తమ ఆఫీసులకు వెళ్లి యధావిధిగా వృత్తి పనుల్లో నిమగ్నం అయ్యారు. మరో 22 శాతం మంది లాక్‌డౌన్‌ సమయంలోనే ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయినట్లు ఈ సర్వే ద్వారా గుర్తించారు. మరో 8 శాతం మంది సాధారణ బలహీనత కారణంగా ఇంకా  వృత్తి విధులకు హాజరుకాలేకపోయినట్లు చెప్పారు.


రెండు వారాల్లోనే 65 శాతం మంది..

హోం ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో 10 రోజుల కంటే ముందుగానే కోలుకున్నట్లు 25 శాతం మంది వెల్లడించారు. 10 నుంచి 14 రోజుల్లో కోలుకున్నట్లు 65 శాతం మంది తెలిపారు. 15 రోజుల కంటే ఎక్కువ విశాంత్రి అవసరమని మరో పది శాతం మంది కరోనా విజేతలు వివరించారు. 


ఖర్చు ఇలా..

హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో రూ. 5 వేల నుంచి 10 వేల రూపాయల మేరకే ఖర్చు అయినట్లు 77 శాతం మంది కరోనా విజేతలు పేర్కొన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంటి వద్దకు వచ్చి ఉచితంగా ఆక్సిజన్‌ అందించాయని కూడా వివరించారు.

Advertisement
Advertisement