ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దు చేసిన 8 దేశాలు.. ఆయా దేశాలపై ఇతర ప్రయాణ ఆంక్షలివే

ABN , First Publish Date - 2021-07-06T22:37:19+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో యూఏఈ పలు దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దు చేసిన 8 దేశాలు.. ఆయా దేశాలపై ఇతర ప్రయాణ ఆంక్షలివే

అబుధాబి: మహమ్మారి కరోనా నేపథ్యంలో యూఏఈ పలు దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్త వేరియంట్లు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నందున యూఏఈ ముందుజాగ్రత్తగా ఆయా దేశాలకు విమానాలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ 8 దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఆయా దేశాలకు తిరిగి ఎప్పటినుంచి విమాన సర్వీసులు ప్రారంభించేది, ఇతర ప్రయాణ ఆంక్షలను వెల్లడించింది. ఎమిరేట్స్ విమానాలు రద్దు చేసిన జాబితాలో బంగ్లాదేశ్, భారత్, నైజీరియా, పాకిస్థాన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం ఉన్నాయి. 


1. బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ నుంచి ప్రయాణికుల రాకపై జూలై 15 వరకు నిషేధం విధించింది. అలాగే గత రెండు వారాల్లో బంగ్లాదేశ్ ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈ రావడానికి అనుమతించబడరని వెల్లడించింది.


2. భారత్

భారత్‌కు విమాన రాకపోకలపై జూలై 15 వరకు బ్యాన్ విధిస్తున్నట్లు ఎమిరేట్స్ ఈ నెల 2న ప్రకటించింది. యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 


3. నైజీరియా

నైజీరియాకు కూడా ఈ నెల 15 వరకు విమాన సర్వీసులు నడపబోమని, అలాగే అక్కడి నుంచి నడిచే విమాన సర్వీసులకు కూడా ఇవే ఆంక్షలు వర్తిస్తాయని ఎమిరేట్స్ పేర్కొంది. ప్రయాణికులు ఎవరైతే లాగోస్, అబుజా నుంచి వస్తారో వారికి దేశంలో ప్రవేశానికి అనుమతి ఉండదు. అలాగే గత 14 రోజుల్లో నైజీరియా ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈలో ప్రవేశానికి అనుమతించబడరు.  


4. పాకిస్తాన్ 

పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కు అన్ని విమాన సర్వీసులను ఈ నెల 15 వరకు రద్దు చేసినట్లు శనివారం ఎమిరేట్స్ వెల్లడించింది. అలాగే గత రెండు వారాల్లో పాక్ ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈ రావడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. 


5. సౌదీ అరేబియా

ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సౌదీకి విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచన మేరకు ఎమిరేట్స్ ఈ ప్రకటన చేసింది. కనుక జూలై 5 నుంచి సౌదీ ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశానికి అనుమతి ఉండదు. 


6. దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాకు కూడా ఈ నెల 15 వరకు విమానాలు క్యాన్సిల్ చేసింది ఎమిరేట్స్. అందుకే ఆ దేశ ప్రయాణికులు ఈ గడువు వరకు యూఏఈకి రావొద్దని తెలియజేసింది. అలాగే రోజువారీ జోహన్నెస్‌బర్గ్ విమాన సర్వీస్  EK 763, అవుట్‌బౌండ్ ప్యాసెంజర్ సర్వీస్ EK 764 కూడా రద్దు చేసింది. దీంతోపాటు గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపింది.  


7. శ్రీలంక

శ్రీలంక నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 15 వరకు నిషేధ ఆంక్షలు ఉన్నట్లు ఎమిరేట్స్ స్పష్టం చేసింది. అయితే, జీసీసీ దేశాల నుంచి శ్రీలంక వెళ్లడానికి ఇంతకుముందు విధించిన ప్రయాణ ఆంక్షలను జూలై 1 నుంచి తొలగించింది. ఇక యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, కువైట్ నుంచి శ్రీలంక వెళ్లే ప్రయాణికులకు అక్కడి నిబంధనలకు లోబడి ప్రవేశానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. 


8. వియత్నాం

వియత్నాంకు తదుపరి నోటీసులు వచ్చే వరకు విమాన సర్వీసులు నిషేధిస్తున్నట్లు గత నెల 4న ఎమిరేట్స్ ప్రకటించింది. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.      

Updated Date - 2021-07-06T22:37:19+05:30 IST