వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల్లో 79% వాటా పెరుగుదే..

ABN , First Publish Date - 2022-07-02T08:35:46+05:30 IST

అమ్మకాలను పెంచుకోవడానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విలువ చేర్చిన ఉత్పత్తుల విక్రయాల పెంచుకోవడంతో పాటు ఈ విభాగంలో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది.

వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల్లో 79% వాటా పెరుగుదే..

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ బ్రహ్మణి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):అమ్మకాలను పెంచుకోవడానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విలువ చేర్చిన  ఉత్పత్తుల విక్రయాల పెంచుకోవడంతో పాటు ఈ విభాగంలో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది. కంపెనీ విక్రయిస్తున్న విలువ చేర్చిన ఉత్పత్తుల  విక్రయాల్లో పెరుగుదే అగ్రస్థానం. వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ (వీఏపీ) ఆదాయంలో పెరుగు వాటా 79 శాతానికి పైగా ఉన్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బ్రహ్మణీ తెలిపారు. వీఏపీ విభాగంలో కంపెనీ బటర్‌మిల్క్‌, లస్సీ, ఫ్లేవర్డ్‌ మిల్క్‌, ఐస్‌క్రీములు, ఫ్రోజెన్‌ డిసర్ట్స్‌ను విక్రయిస్తోంది.

26 శాతం ఆదాయం వీఏపీలదే: గత ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ విక్రయాలు రూ.2,681 కోట్లు ఉండగా.. విలువ చేర్చిన ఉత్పత్తుల విక్రయాలు ఇందులో రూ.696 కోట్ల (26ు) మేరకు ఉన్నాయి. 2021-22లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వీఏపీ విక్రయాలు 19.45 శాతం మేరకు పెరిగాయి. రోజుకు 286 టన్నుల పెరుగును కంపెనీ విక్రయించింది. అంతక్రితం ఏడాదిలో ఇది 244 టన్నులు ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య విలువ చేర్చిన ఉత్పత్తుల విక్రయాలు ఏడాదికి సగటున 5.76 శాతం పెరిగాయని కంపెనీ వెల్లడించింది. అధిక మార్జిన్లు, దీర్ఘకాలం నిల్వ ఉండే స్వభావం, సులభ రవాణా వంటి అంశాలు విలువ చేర్చిన ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తోందని బ్రహ్మణి వివరించారు. కంపెనీ వృద్ధికి విలువ చేర్చిన ఉత్పత్తులు మూలాధారమని వ్యాఖ్యానించారు. విలువ చేర్చిన ఉత్పత్తుల్లో ముందుగా పోటీ తక్కువ ఉన్న ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరిస్తాం. మార్కెటింగ్‌, ఇన్నోవేషన్లలో వినియోగదారే మా కేంద్ర బిందువని తెలిపారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 6,464 డిస్టిబ్యూటర్లు, 65 హెరిటేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఉన్నాయి. 

Updated Date - 2022-07-02T08:35:46+05:30 IST