30 రోజులు 787 కేసులు

ABN , First Publish Date - 2020-07-01T09:35:47+05:30 IST

కరోనా విశ్వరూపం చూపిస్తోంది. జిల్లాలో ఏరోజుకారోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

30 రోజులు 787 కేసులు

జూన్‌ నెలలో విజృంభించిన కరోనా

అప్రమత్తం కాకుంటే జూలైలో మరింత దారుణ పరిస్థితి


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) : కరోనా విశ్వరూపం చూపిస్తోంది. జిల్లాలో ఏరోజుకారోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా జూన్‌ మాసం ప్రారంభమైన తరువాత కేసుల నమోదులో వేగం పెరిగింది. మొదటి కేసు నమోదైన మార్చి 19 నుంచి మే 31 వరకు 74 రోజుల్లో 113 కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క జూన్‌ నెలలోనే సుమారు 787 వచ్చాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వంటివి వైరస్‌ విజృంభణకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు అప్రమత్తం కాకపోతే..జూన్‌ కంటే జూలైలో పరిస్థితి మరింత దారుణంగా వుండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. 


మొదటి వారం నుంచే.. 

జూన్‌ మొదటి వారంలో 66, రెండో వారంలో 104, మూడో వారంలో 160, నాలుగో వారంలో ఏకంగా 323 కరోనా కేసులు నమోదయ్యాయి. చివరి రెండు రోజుల్లో ఏకంగా 134 వచ్చాయి. చివరి మూడు రోజుల్లో ప్రతిరోజూ 50కుపైగా కేసులు నమోదయ్యాయి. 28న 53, 29న 58, 30న 76...మూడు రోజుల్లో 187 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు, వైద్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య 900కు చేరుకోగా, వైరస్‌ నుంచి కోలుకుని 367 మంది డిశ్చార్జ్‌ కాగా, 528 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్‌ బారినపడి ఐదుగురు మృతి చెందారు. 


అప్రమత్తత అవసరం.. 

వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2020-07-01T09:35:47+05:30 IST