75 ఏళ్ల స్వాతంత్ర్య స్ఫూర్తి, భారత్ విజయాలను ప్రపంచానికి చాటుదాం: మోదీ

ABN , First Publish Date - 2021-03-09T01:41:27+05:30 IST

దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి..

75 ఏళ్ల స్వాతంత్ర్య స్ఫూర్తి, భారత్ విజయాలను ప్రపంచానికి చాటుదాం: మోదీ

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నభూతో న భవిష్యతి అనే రీతిలో నిర్వహిచేందుకు తన అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నత స్థాయి జాతీయ కమిటీతో తొలిసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని సోమవారంనాడు మాట్లాడారు.


'1947 నుంచి దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశం. స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది. 130 కోట్ల దేశ ప్రజలందరితో కలిసి ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం. ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. వేడుకల్లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి త్యాగాలను స్మరించుకుందా. దేశ ప్రజల కలల సాకారానికి ప్రతిన బూనుదాం. నూతన సంకల్పాలకు ప్రతిన బూనుదాం. సనాతన భారతంతో పాటు నవీన భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటుదాం. మన యోగుల ఆధ్యాత్మిక ప్రతిభను, శాస్త్రవేత్తల బలాన్ని ప్రతిబిబించేలా స్వాంతంత్ర్య వేడుకలను ఒక పండుగలా నిర్వహించుకుందా' అని ప్రధాని అన్నారు.


ప్రధానితో జరిగిన సమావేశంలో జాతీయ కమిటీ సభ్యులైన మాజీ రాష్ట్రపతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, నవీన్ పట్నాయక్, మల్లికార్జున్ ఖర్చే, మీరాకుమార్, సుమిత్రా మహాజన్, జేపీ నడ్డా, మౌలానా వహియుద్దీన్ ఖాన్ తదితరులు పలు సూచనలు చేసినట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో స్వాంతంత్ర్యానంతరం సాధించిన విజయాలపై కార్యక్రమాలు నిర్వహించడంపై దృష్టి సారించాలని జాతీయ కమిటీ సభ్యులు సూచించారు.


జాతీయ కమిటీ సభ్యుల్లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సీజేఐ ఎస్.ఏ.బాబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, 28 మంది ముఖ్యమంత్రులు, కళాకారులు లతా మంగేష్కర్, ఎ.ఆర్.రెహమాన్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అడ్వాణి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి తదితరులు ఉన్నాయి.

Updated Date - 2021-03-09T01:41:27+05:30 IST