పాటకు 75 ఏండ్లు తూటాకు 25 ఏండ్లు

ABN , First Publish Date - 2022-04-06T06:10:10+05:30 IST

ఆ రోజు పొద్దంత సూర్యుడు భగ, భగ, మండి చీకటి గర్భంలో మునిగిపోయి నిద్దురకు సిద్ధమౌతున్న వేళ 6th April 1997...

పాటకు 75 ఏండ్లు తూటాకు 25 ఏండ్లు

ఆ రోజు

పొద్దంత సూర్యుడు

భగ, భగ, మండి

చీకటి గర్భంలో మునిగిపోయి–

నిద్దురకు సిద్ధమౌతున్న వేళ

6th April 1997

సమయం సాయంత్రం 6గంటలు–


సడెన్‌గా

ఆరు తూటాల శబ్దం–

నెత్తురుమడుగులో మునిగిపోయిన

ప్రజల పాట–

విమల వొడిలో రాలిపోయిండు.

అస్తమిస్తున్న సూర్యునిపై

చిందిన నెత్తురుచుక్కలు

నేస్తమా ఇక సెలవు అంటూ 

     సూర్యుడు అస్తమించిండు

నెత్తురు ముద్దను

భుజంమీద ఎత్తుకున్న సూర్యం.

హంతకుల కారును–

వెంబడిస్తున్న వెన్నెల

అంతవరకే గుర్తు!


కాలం– సమయం

కష్టకాలం

తిరగబడుతున్న సమయం–

తిరగబడ్డ తెలంగాణ ఉద్యమం

బూటకపు ఎన్‌కౌంటర్లు–

పౌరహక్కుల చుట్టు–

ఇనుప కంచెలు–


పాట

ప్రజల పాటలై

ప్రజల గుండెల్లో

లీనమై పోయి–

ఫెళ, ఫెళ, పేలి

పాలకులను ప్రశ్నించి

సుత్తీ, కొడవలయ్యింది


రాజ్యమే–

రాజ్యహింస ఐనప్పుడు

పాలనే

ప్రజలను కాల్చుక తింటున్నప్పుడు

న్యాయస్థానం

కండ్లకు గంతలు కట్టుకున్నప్పుడు

పాట–

గాండ్రించి, గర్జించి

గొంతును చించుకొని అర్చింది

ఆకాశంలో ఎగిరి దుంకింది

తూటాలకు–

ఎదురీదే పాటలయ్యింది

ప్రజలు పాటను అందుకొన్నారు

వందనాలు– వందనాలురో

మా బిడ్డెలు...

తుపాకుల తూటాల శబ్దాలు

పాటకు పల్లవిపాడినవి.

ఆ దృశ్య కావ్యాన్ని చూసి

పాలకులు నివ్వెరపోయారు

మన తుపాకులనే

విప్లవ పాటలు పాడించే

ఆ పాటగాడు

ఆ ఆటగాడు

ఆ మాటగాడు–

ఎవ్వడు వాడు! 

   ఎంత ధైర్యం– సాహసం


After all.

గోసిగాడు, గొంగడిగాడు

డప్పుగాడు, చెప్పుగాడు

మనకాల్ల ఉంది మన్ను

మన కన్నులో పడింది.

ఇక చూస్తూ ఊరుకొనేది లేదని

పాలకులు:

పట, పట, పండ్లు కొరికి

ఆ శబ్దాన్ని

ఉరితీయండి

కాల్చేయండి

చంపెయ్యండి–

పిచ్చికుక్కలా కూతబెట్టారు


నిశ్శబ్దం–

బద్దలై–

ఒరెయ్‌–

శబ్దాన్ని బంధించలేవు

అంతకంటె

అంతమొందించలేవవి

ప్రకృతి శబ్దం–

ప్రళయ శబ్దమయ్యింది


నిజం.

సత్యమే.

వేలాది జనం–

దేశంలోని లక్షలాది జనం

ప్రపంచంలోని కోట్లాది జనం

ఆ శబ్దం మోసుకచ్చిన

నెత్తురు వార్తను విని

ఒకే గొంతై

నాదమై–

నినాదమై

‘‘ప్రజల పాటకు చావులేదు

పాలకులకే చావని’’

సైరన్‌ వేసినారు.

పాటకు నెత్తురు పోసి–

గాయాలను ముద్దుపెట్టుకున్నారు

పాలకులను చుట్టుముట్టేశారు.


పాలకుడు–

పాట బతికే ఉందని

ప్రజల ముందు శిరస్సు వొంచాడు.

మేం నమ్మం, నమ్మం.

ప్రజలు తిరగబడ్డారు

నిజం! నిజం!

నెత్తురు మరకల గుర్తుల

సూర్యం, వెన్నెల, విమల

ప్రజల ముందుకు వచ్చి–

పిడికిలెత్తి బాస చేసారు–

వెయ్యి డప్పులు, లక్ష గొంతులు

విప్లవం వర్ధిల్లాలని

హోరెత్తించారు–

నిమ్స్‌

హాస్పిటల్‌–

వెంటిలేటర్సు నుండి

శ్వాస, ఉచ్ఛ్వాసల

శబ్ద తరంగాల సంగీతం–


పాటమ్మ–

మా పాట నీవే మాయమ్మా...

పాటమ్మ...

మా గాయం నీవే మాయమ్మా

(ఏప్రిల్‌ 6, 1997. సా. 6గం.లకు నాపై పేలిన ఆరు తూటాల నుండి– 7 గం.లకు నిమ్స్‌ చేరే వరకు– కనురెప్పలు మూసుకునే వరకు– చూసిన దృశ్య కావ్యం ఇది.)

గద్దర్‌


Updated Date - 2022-04-06T06:10:10+05:30 IST