నిర‌స‌న‌కారుడిపై న్యూయార్క్ పోలీసుల జులుం !

ABN , First Publish Date - 2020-06-05T18:24:06+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యంలో వారం రోజులుగా నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి.

నిర‌స‌న‌కారుడిపై న్యూయార్క్ పోలీసుల జులుం !

వాషింగ్ట‌న్ డీసీ: జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యంలో వారం రోజులుగా నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. న‌ల్ల‌జాతి ఆందోళ‌న‌ల‌తో యూఎస్ అట్టుడుకుతోంది. 'ఐ కాంట్ బ్రీత్' పేరిట న‌ల్ల‌జాతీయులు అమెరికాలో తీవ్ర స్థాయిలో నిర‌స‌నలు చేస్తున్నారు. అల్లర్లు, లూటీలు, విధ్వంసాలు, దాడులతో సుమారు 20 రాష్ట్రాల్లో న‌ల్ల‌జాతీయులు క‌ల్లోలం సృష్టిస్తున్నారు. గురువారం కూడా యూఎస్ వ్యాప్తంగా ఫ్లాయిడ్‌కు న్యాయం జ‌ర‌గాలంటూ ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ఈ క్రమంలో నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు రంగంలోకి దిగిన న్యూయార్క్ బ‌ఫెలో పోలీసులు ఓ వ్య‌క్తిని కింద‌కు తోసేసిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. నిర‌స‌న తెలుపుతున్న 75 ఏళ్ల వృద్ధుడ్ని పోలీసులు అమానుషంగా కింద‌కు తోసేయ‌డం... దాంతో అత‌ని త‌ల వెనుక‌వైపు గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌డంతో ర‌క్తం కార‌డం వీడియోలో ఉంది.


కింద‌ప‌డిపోయిన వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టించుకోకుండా వెళ్లిపోవ‌డం కూడా వీడియోలో రికార్డైంది. పోలీసులు క‌వాతు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాగా, ఈ దృశ్యాల‌ను స్థానిక రేడియా స్టేషన్‌ డబ్ల్యూఎఫ్‌ఓ వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. అయితే... వృద్ధుడ్ని నెట్టేసిన పోలీసులను పై అధికారులు విధుల నుంచి తొల‌గించిన‌ట్లు స‌మాచారం. గాయ‌ప‌డిన పెద్దాయ‌న ప్ర‌స్తుతం ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు డబ్ల్యూఎఫ్‌ఓ పేర్కొంది. పోలీసుల చ‌ర్య‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇంతా జ‌రుగుతున్న పోలీసులు మార‌రు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Updated Date - 2020-06-05T18:24:06+05:30 IST