ముంపు ప్రాంతాల గతేంటి?

ABN , First Publish Date - 2021-05-10T09:06:58+05:30 IST

గోదావరి పోటెత్తితే.. గత ఏడాదిలానే ఈసారి 23 లక్షల క్యూసెక్కు వరద వస్తే.. ముంపు ప్రాంతాలు మునిగిపోవడం ఖాయమన్న ఆందోళన అధికమవుతోంది

ముంపు ప్రాంతాల గతేంటి?

పోలవరానికి 746 కోట్లు మంజూరు

అందులో నిర్వాసితులకు 178 కోట్లే

హెడ్‌ వర్క్స్‌కు మాత్రం రూ.560 కోట్లు

జూన్‌లో భారీవరద వస్తే లంకలన్నీ మునకే!

పరిహారం చెల్లిస్తేనే ఖాళీ చేస్తామంటున్న బాధితులు


అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): గోదావరి పోటెత్తితే.. గత ఏడాదిలానే ఈసారి 23 లక్షల క్యూసెక్కు వరద వస్తే.. ముంపు ప్రాంతాలు మునిగిపోవడం ఖాయమన్న ఆందోళన అధికమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2021-22 సంవత్సరానికి రూ.746 కోట్లను విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్‌ సంహ్‌ రావత్‌ తాజాగా ఉత్తర్వు జారీ చేశారు. ఇందులో అత్యంత ప్రాధాన్యం కలిగిన నిర్వాసితులకు సహాయ పునరావాసానికి కేవలం రూ.178 కోట్లు కేటాయించారు. మిగతా రూ.560 కోట్లు ప్రాజెక్టు ప్రధాన పనులకు కేటాయించడం చర్చనీయాంశమైంది. 41.15 కాంటూరుకు సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వహించాలంటే రూ.350 కోట్ల వరకూ వ్యయం చేయాల్సి ఉంటుందని.. ఈ నిధులను ఈ ఏడాది మార్చినాటికే విడుదల చేయాల్సి ఉందని జల వనరుల శాఖతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షల్లో అధికారులు నివేదిస్తూ వచ్చారు. కానీ ఆ స్థాయిలో నిధులు విడుదల కాలేదు. వాస్తవానికి గత ఏడాది జూలై 8వ తేదీనాటికి పోలవరం నిర్వాసితుల కోసం 50 వేల ఇళ్లను కట్టిచూపిస్తామని ప్రతిపక్షాలకు ప్రభుత్వం సవాల్‌ విసరింది. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. వచ్చే నెల జూన్‌లో వరదలు వస్తాయి. 


అంటే ఈ నెలాఖరులో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తిచేయాలని జల వనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వాటిని పూర్తి చేస్తే 41.15 మీటర్ల కాంటూరులో ముంపు బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లంక గ్రామాలన్నీ మునిగిపోతాయి. గత ఏడాది తరహాలో భారీ వరద వస్తే .. ముంపు గ్రామాలన్నీ నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ప్రతిపక్షంలో ఉండగా.. ప్రాజెక్టు నిర్మాణమంటే హెడ్‌వర్క్స్‌ పనులు కాదని, ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడమని జగన్‌ పదే పదే చెప్పేవారు. 2004లో తక్కువ ధరలకు భూములిచ్చినవారికి అదనపు చెల్లింపులు చేస్తామని ఎన్నికలముందు హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాము ఇళ్లు ఖాళీ చేయాలంటే ముందస్తుగా పరిహారం చెల్లించాలని.. పెంచి ఇస్తామన్న పైకం కూడా ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటిదాకా గ్రామాలను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో సహాయ పునరావాస చర్యలకు 178కోట్లు మాత్రమే విడుదల  చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-05-10T09:06:58+05:30 IST