లాసెట్‌లో 74 శాతం అర్హత

ABN , First Publish Date - 2022-08-18T09:01:44+05:30 IST

లాసెట్‌లో 74 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాసెట్‌ పరీక్షకు హాజరైనవారిలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీలు చేసినవారే కాకుండా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చేసినవారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు.

లాసెట్‌లో 74 శాతం అర్హత

 గతేడాది కంటే పెరిగిన అర్హుల శాతం

పరీక్ష రాసినవారిలో ఇంజనీర్లు, డాక్టర్లు

త్వరలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా సీట్లు


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): లాసెట్‌లో 74 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాసెట్‌ పరీక్షకు హాజరైనవారిలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీలు చేసినవారే కాకుండా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చేసినవారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. జూలై 21, 22 తేదీల్లో నిర్వహించిన లాసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి బుధవారం ప్రకటించారు. మూ డేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతోపాటు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 35,538 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 28,921 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా....


వారిలో 21,662 మంది (74.90 శాతం) అర్హత సాధించారు. కాగా, అర్హత సాధించినవారిలో మూడేళ్ల కోర్సులో 74.76 శాతం మంది, ఐదేళ్ల కోర్సులో 68.57 శాతం, ఎల్‌ఎల్‌ఎంలో 91.10 శాతం మంది ఉన్నారు. అలాగే గతేడాదితో పోలిస్తే అర్హత సాధించినవారి శాతం కొంత మేర పెరిగింది. గతేడాది 68.84 శాతం మంది అర్హత సాధించగా, ఈసారి 74.90 శాతం అర్హత సాధించడం విశేషం. ఈ ఏడాది లాసెట్‌కు  ఇంజనీరింగ్‌ చేసిన అభ్యర్థులు 4,382 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 3,271 మంది పరీక్షలు రాయగా... వారిలో 2,733 మంది అర్హత సాధించారు. అలాగే 67 మంది వైద్యులు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో 38 మంది పరీక్షలకు హాజరుకాగా... వారిలో 34 మంది అర్హత సాధించారు. కాగా, లా కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో సుమారు 7,022 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడేళ్ల లా కోర్సులో 4,449 సీట్లు, ఐదేళ్ల లా కోర్సులో 1,818 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలో 755 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. 

Updated Date - 2022-08-18T09:01:44+05:30 IST