వికారాబాద్‌ జిల్లాలో 74శాతం ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-26T04:23:25+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో 74శాతం ఫీవర్‌ సర్వే

వికారాబాద్‌ జిల్లాలో  74శాతం ఫీవర్‌ సర్వే
చౌడాపూర్‌ మండలం విఠలాపూర్‌లో జ్వరం వచ్చిన వారికి మందులు పంపిణీ చేస్తున్న జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌

  •  వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 7,078 మందికి అనుమానిత లక్షణాలు
  •  తీవ్రత అధికంగా ఉన్న 3,097 మందికి కొవిడ్‌ పరీక్షలు
  •  అందులో 299 మందికి పాజిటివ్‌
  •  మరో మూడు రోజుల పాటు సర్వే

వికారాబాద్‌/మేడ్చల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): ప్రజల్లో కొవిడ్‌ అనుమానిత లక్షణాలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే జిల్లాలో 74 శాతం పూర్తయింది. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజల్లో ఎంత మంది జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, నొప్పులు, నిస్సత్తువ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారనేది గుర్తించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలు, 566 గ్రామ పంచాయతీల పరిధిలో ఫీవర్‌ సర్వే నిర్వహించేందుకు మొత్తం 745 బృందాలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుకో కమిటీ, గ్రామాల్లో గ్రామానికో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిరోజూ 25 గృహాలకు తగ్గకుండా ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లో ఒక్కోబృందంలో ఆశ, ఏఎన్‌ఎం, మునిసిపల్‌ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో బృందంలో ఆశ, ఏఎన్‌ఎం, పంచాయతీ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. జిల్లాలో 2,20,386 గృహాలు ఉండగా, మంగళవారం వరకు  1,61,808 గృహాల్లో సర్వే చేసి 7,078 మంది అనుమానిత లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 6,931 మందికి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కాగా, అనుమానిత లక్షణాల తీవ్రత అధికంగా ఉన్న 3,097 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో 299 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జిల్లాలో ఫీవర్‌ సర్వే పూర్తయ్యేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. 

మేడ్చల్‌ జిల్లాలో ఐదో రోజు..

 మేడ్చల్‌  జిల్లాలో నిర్వహించిన జ్వరం సర్వే ఐదో రోజుల్లో 3,54,806 ఇళ్లలో నివవసిస్తున్న వారి సమాచారం సేకరించారు. అందులో 15,396 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు. మంగళవారం  71,734 గృహాల్లో సర్వే చేశారు. 2,977 మందికి హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు. గ్రామా పంచాయతీల్లో 3,967 గృహాల్లో సర్వే నిర్వహించి 69 మందికి, మునిసిపాలిటీ, కార్పోరేషన్‌ పరిధిలో 34,049 గృహాల్లో సర్వే నిర్వహించి 548 మందికి, జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33,718 గృహాల్లో సర్వే నిర్వహించి 1,110 మందికి మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో మరో 1,214 మందికి మెడికల్‌ కిట్లను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు తెలిపారు

Updated Date - 2022-01-26T04:23:25+05:30 IST