‘40 ఏళ్ల వైవాహిక జీవితం ముగిశాక.. తొలిసారిగా దాన్ని చవిచూశా..’ వృద్ధురాలి Viral కథనం.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-15T01:27:26+05:30 IST

ప్రేమికుల రోజున ఓ వృద్ధురాలి(73) ఉదంతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల వైవాహిక జీవితం ముగిశాక తనకు నిజమైన ప్రేమ అంటే ఏంటో అనుభవంలోకి వచ్చిదంటూ...

‘40 ఏళ్ల  వైవాహిక జీవితం ముగిశాక.. తొలిసారిగా దాన్ని చవిచూశా..’  వృద్ధురాలి Viral కథనం.. అసలు విషయం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: వాలెంటైన్స్ డే రోజున యువ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతాయి. తమదైన లోకంలో విహరిస్తుంటాయి. మరికొందరేమో బ్రేకప్‌ల కారణంగా దిక్కుతోచని స్థితిలో కూరుకుపోతుంటారు. తమ మనోభావాలను ప్రతిఫలించేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు.  అయితే.. ఇదంతా చాలా కామన్.. ప్రతి ఏటా కనిపించే దృశ్యాలే.  కానీ.. ఈసారి ఓ వృద్ధురాలి(73) ఉదంతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల వైవాహిక జీవితం ముగిశాక తనకు నిజమైన ప్రేమ అంటే ఏంటో అనుభవంలోకి వచ్చిందంటూ క్యాలిఫోర్నియా రాష్ట్రానికి(అమెరికా) చెందిన కేరోల్ హెచ్ మ్యాక్ ట్విటర్‌లో చేసిన చిన్న వ్యాఖ్య ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.  


‘‘జీవితం ఓ పెద్ద వింత. 40 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత నేను ఒంటరినవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇక 73 ఏళ్ల వయస్సులో నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుందని, కరోనా సంక్షోభం నడుమ ఇది జరుగుతుందని అసలే ఊహించలేదు’’ అంటూ ట్వీట్ చేసిన కేరోల్ దానికి జతగా.. తన సహచరుడు ఇచ్చిన ఉంగరం ధరించి ఓ ఫొటో దిగి దాన్నీ షేర్ చేశారు. అంతే.. క్షణాల్లో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయిపోయింది. చూడటానికి ఇది చాలా సింపుల్ ట్వీటే అయినా నెటిజన్లకు తెగ నచ్చేసింది. అయితే.. ఈ పోస్టు చూసిన వారు వేసిన మొదటి ప్రశ్న..  కేరోల్ భర్త చనిపోయారా అని. అయితే.. అటువంటిదేం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘‘కాదు.. కాదు.. నేనే అతడిని తరిమేశా.. అతడు చాలా కాలంగా మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని గుర్తించి అతడిని వదిలించుకున్నా.. ఇక ఆ తరువాత వెనక్కు తిరిగి చూసుకోలేదు.’’ అంటూ ఆమె వివరించారు. 


అదే సమయంలో.. భారత్‌లోని అరేంజ్డ్ మ్యారేజస్ గురించి కొందరు ప్రస్తావించగా.. కేరోల్ రిప్లై ఇచ్చారు. ‘‘వాస్తవానికి నాకు పెద్దలు కుదిర్చే వివాహాలపై నమ్మకం ఉంది. పిల్లల్లకు ఏం కావాలో తల్లిదండ్రులకే బాగా తెలుస్తుంది. కాబట్టి.. హార్మోన్ల ప్రభావంతో ఆవేశంలో ఉండే పిల్లలపై వారు ముఖ్యనిర్ణయాలను వదిలిపెట్టరు. అంతేకాకుండా.. ఉమ్మడి విలువలు, ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే వైవాహిక జీవితం ఆనందమయమవుతుంది. అయితే.. అప్పట్లో నా నిర్ణయాలు నేనే తీసుకునేదాన్ని’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కథనం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అన్నట్టు.. కేరోల్ గతంలో నర్సుగా పనిచేశారు. ఇప్పుడు తనది దాదాపు రిటైర్మెంటే అని ఆమె తెలిపారు. తన మనసు గెలుచుకున్నది ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్ గానే ఉంచారు.



Updated Date - 2022-02-15T01:27:26+05:30 IST