మీరట్: ఉత్తరప్రదేశ్లో ఒకవైపు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతుండగా, మరోవైపు ఒక విచిత్రమైన కేసు వెలుగు చూసింది. ఒక వృద్ధునికి ఐదుసార్లు టీకా వేశారు. అయితే ఇదంతా కాగితాలలోనే కనిపించింది. ఆరోసారి టీకా వేసేందుకు డేట్ కూడా ఇచ్చారు. మరోవైపు ఇతని దగ్గర మూడు ఆన్లైన్ టీకా సర్టిఫికెట్లు కూడా ఉండటం విశేషం. మీరఠ్లోని సర్ధనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు.
ఈ వృద్ధుని పేరు చౌదరి రామ్పాల్ సింగ్. రామ్పాల్ మొదటి డోసు టీకా మార్చి16న, రెండవ డోసు టీకా మే 8న తీసుకున్నాడు. అయితే రామ్పాల్ తన టీకా సర్టిఫికెట్ను ఆన్లైన్లో పొందాలనుకున్నప్పుడు సమస్య ఎదురయ్యింది. దీంతో రామ్పాల్ ఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరుకుని, తన టీకాకు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని కోరాడు. ఈ నేపధ్యంలో అతని టీకా వివరాల కోసం ప్రభుత్వ వెబ్సైట్లో పరిశీలించినపుడు అతనికి సంబంధించిన మూడు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కనిపించాయి. మొదటి రెండు సర్టిఫికెట్లలో రామ్ పాల్ రెండు డోసుల టీకాలు తీసుకున్నట్లు నమోదయ్యింది. మూడవ సర్టిఫికెట్లో అతను ఒక డోసు టీకా తీసుకున్నట్లు ఉంది. 2021 డిసెంబర్లో మరో డోసు టీకా ఇస్తామని దానిలో ఉంది. రాంపాల్ తెలిపిన వివరాల ప్రకారం అతనికి ఆరోగ్య కేంద్రంలో రెండు డోసుల టీకాను తగిన వ్యవధిలో ఇచ్చారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆరోగ్యశాఖ టెక్నికల్ టీమ్ నుంచి వివరాలు సేకరిస్తోంది.