సైనిక బలిమి.. సాంస్కృతిక కలిమి

ABN , First Publish Date - 2021-01-27T07:02:44+05:30 IST

భారతదేశ సైనిక బలిమిని.. సాంస్కృతిక కలిమిని, వైవిధ్యాన్ని.. చాటిచెప్పే విధంగా ఢిల్లీలో 72వ గణతంత్ర దిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో జరిగిన ఈ

సైనిక బలిమి.. సాంస్కృతిక కలిమి

ఢిల్లీలో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు

రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణ


న్యూఢిల్లీ, జనవరి 26: భారతదేశ సైనిక బలిమిని.. సాంస్కృతిక కలిమిని, వైవిధ్యాన్ని.. చాటిచెప్పే విధంగా ఢిల్లీలో 72వ గణతంత్ర దిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. త్రివిధ దళాల సైనిక పాటవాన్ని.. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ఘనతను ఈ వేడుకలు ఘనంగా చాటాయి. టీ-90 భీష్మ ట్యాంకులు, బిఎంపీ-2 శరత్‌ యుద్ధవాహనాలు, సంవిజయ్‌ ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్‌, సుఖోయ్‌-30 ఎంకేఐ ఫైటర్‌ విమానాలతో సాయుధ దళాలు తమ సత్తా చాటాయి. అయితే, కరోనా కారణంగా ఈ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను 25 వేలకు పరిమితం చేశారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా మన దళాలు 8.5 కిలోమీటర్ల మేర కవాతు చేయడం కద్దు. కానీ, ఈసారి  ఆ దూరాన్ని 3.5 కిలోమీటర్లకు తగ్గించారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటై 50 ఏళ్లయిన సందర్భంగా 1971లో పోరాడిన ‘ముక్తియోధుల’ పోరాట పటిమకు చిహ్నంగా బంగ్లాదేశ్‌కు చెందిన 122 మందితో కూడిన దళం ఈ వేడుకల్లో కవాతు చేసింది.


వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు, రక్షణ శాఖకు చెందిన ఆరు శకటాలు, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన మరో 9 శకటాలు.. మొత్తం 32 శకటాలు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో కనువిందు చేశాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన లద్దాఖ్‌ శకటం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో మెరిసింది. లేపాక్షి బసవన్న, శిల్పసంపదను సగర్వంగా ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక, రఫెల్‌ యుద్ధవిమానం సహా.. భారత వైమానిక దళానికి చెందిన 38 విమానాలు, ఆర్మీకి చెందిన నాలుగు విమానాలు గగనతల విన్యాసాల్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా.. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వర్టికల్‌ చార్లీ విన్యాసం చేసిన రఫెల్‌ యుద్ధ విమానం అందరి దృష్టినీ ఆకర్షించి ‘షో స్టాపర్‌’గా నిలిచింది. అలాగే, రెండు జాగ్వార్‌ విమానాలు, రెండు మిగ్‌-29లతో కలిసి రఫెల్‌ ‘ఏకలవ్య ఫార్మేషన్‌ (ఆంగ్ల ‘వి’ అక్షరం ఆకారం)’లో కూడా పాల్గొంది. అంతకుముందు, మంగళవారం ఉదయం ప్రధాని మోదీ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అమర జవాన్లకు అంజలి ఘటించి.. దేశానికి వారు చేసిన సేవల గురించి, వారి త్యాగాల గురించి సంస్మరించుకున్నారు.


కాగా, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. కరోనా కారణంగా రాలేకపోయానంటూ భారతీయులకు ఒక వీడియో సందేశం ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మోదీకి, భారత ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ట్వీట్‌ చేశారు. మనదేశంలోని తొలి ముగ్గురు యుద్ధవిమాన పైలట్లలో ఒకరైన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ భావనా కాంత్‌ భారత వైమానిక దళ శకటంపై మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారు. అలాగే.. 2016లో ఎన్‌సీసీ కేడెట్‌గా గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రీతీ చౌదరి.. ఈసారి ‘కెప్టెన్‌’ హోదాలో 140 ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌ తరఫున అభివృద్ధి చేసిన షిలికా వెపన్‌ సిస్టమ్‌ శకటానికి నేతృత్వం వహించారు. ఆర్మీ నుంచి ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఏకైక మహిళా కంటింజెంట్‌ కమాండర్‌ ఆమే కావడం విశేషం. 


జామ్‌నగర్‌ నుంచి మోదీకి తలపాగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన ఎరుపు, పసుపు చుక్కల తలపాగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘హలారీ పఘ్‌డీ’గా పేర్కొనే ఈ తలపాగాను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన రాజకుటుంబం మోదీకి బహుమతిగా పంపించింది. జామ్‌నగర్‌ ఎంపీ పూనమ్‌బెన్‌ ట్విటర్‌లో దీనిపై స్పందించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా  మోదీని జామ్‌నగర్‌ ‘హలారీ పఘ్‌డీ’లో చూడటం చాలా గర్వంగా ఉందన్నారు. సంప్రదాయ కుర్తా, పైజామా, బూడిదరంగులో పైకోటు, మాస్కును కూడా మోదీ ధరించారు. 

Updated Date - 2021-01-27T07:02:44+05:30 IST