173 వార్డులకు రంగంలో 724 మంది

ABN , First Publish Date - 2021-03-04T07:06:35+05:30 IST

జిల్లాలో అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.

173 వార్డులకు రంగంలో 724 మంది
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గొడవ పడుతున్న టీడీపీ, వైసీపీ నాయకులను బయటకు పంపుతున్న పోలీసులు

ముగిసిన మునిసిపల్‌ ఉపసంహరణలు

24 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం

అద్దంకిలో ఒకచోట అందరూ విత్‌డ్రా

రద్దీగా మునిసిపల్‌ ఆఫీసులు, పటిష్ట బందోబస్తు

ఒంగోలు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 24వార్డులు ఏకగ్రీవం కాగా అన్నింటిని వైసీపీ దక్కించుకుంది. అద్దంకిలో ఒక వార్డులో అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలిన 173 వార్డుల్లో 724మంది  రంగంలో ఉన్నారు. గతేడాది ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు ఒంగోలులోని 50 డివిజన్లకు 424 మంది, మరో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లోని 148 వార్డులకు 1,044 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు.  తాజాగా ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళ,. బుఽధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయి. ఆయా మునిసిపల్‌ కార్యాలయాల వద్ద పటిష్ట బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. ఒకవైపు ఉపసంహరణలకు, మరోవైపు బీఫాంలు అందజేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులు, పార్టీల నేతల రాకతో ఆయా మునిసిపల్‌ ఆఫీసుల వద్ద బుధవారం రద్దీ వాతావరణం కనిపించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయడంతో ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 28వ డివిజన్‌ ఏకగ్రీవం కాగా కనిగిరిలో 7, గిద్దలూరులో 7, మార్కాపురంలో 5, చీరాలలో 3, చీమకుర్తిలో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యాయి. అద్దంకిలో ఒక్కటి కూడా కాలేదు. అయితే అక్కడ ఒక వార్డులో నామినేషన్‌ వేసిన అందరూ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఆ వార్డులో ఎన్నిక అగిపోయింది. కాగా ఇలా ఏకగ్రీవాలు, అగినది కలిపి 25 వార్డులు ఉండగా మిగిలిన 173వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా మొత్తం 724మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 

Updated Date - 2021-03-04T07:06:35+05:30 IST