అమెరికాలో దారుణం.. వాకింగ్‌కని బయటకు వెళ్లిన భారతీయ వృద్ధుడిని..

ABN , First Publish Date - 2022-04-05T01:47:01+05:30 IST

అమెరికాలో మరోసారి జాత్యాహంకారం బుసల కొట్టింది. ఆదివారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఓ భారతీయ వృద్ధుడిపై(70) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. అకారణంగా.. బాధితుడు నిర్మల్ సింగ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ముఖంపై గాయాలయ్యాయి. న్యూయార్క్ నగరంలోని..

అమెరికాలో దారుణం.. వాకింగ్‌కని బయటకు వెళ్లిన భారతీయ వృద్ధుడిని..

క్వీన్స్(న్యూయార్క్ సిటీ): అమెరికాలో మరోసారి జాత్యాహంకారం బుసల కొట్టింది. ఆదివారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఓ భారతీయ వృద్ధుడిపై(70) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. అకారణంగా.. బాధితుడు నిర్మల్ సింగ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ముఖంపై గాయాలయ్యాయి. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. తన మానాన తాను నడుచుకుంటూ వెళుతుండగా.. ఈ దాడి జరిగినట్టు బాధితుడు స్థానిక మీడియాకు తెలిపారు. 


దాడి సందర్భంగా నిందితుడు నిర్మల్ సింగ్‌తో ఏ మాటా మాట్లాడలేదని పోలీసులు తెలిపారు.  ఈ దాడిలో బాధితుడి ముక్కు విరిగిపోయిందని చెప్పారు. అటుగా వెళుతున్న స్థానికుడు ఒకరు.. నిర్మల్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటివరకూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు. అంతేకాకుండా.. దీన్ని ద్వేషపూరిత దాడిగా కూడా వారు ఇంకా గుర్తించలేదని సమాచారం. 


మరోవైపు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దక్షిణాసియాకు చెందిన వారు తమ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది జాత్యాహంకార పూరిత దాడేనని భారత సంతతికి చెందిన  స్థానిక సమాజిక కార్యకర్త జప్నీత్ సింగ్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘‘తలపాగా ధరించిన మమ్మల్ని అదో రకంగా చూసే వారు తరచూ ఎదురవుతుంటారు’’ అని ఆయన తెలిపారు. సిక్కు మతానికి చెందిన వారు సాధారణంగా ఇలాంటి విద్వేషపూరిత దాడులకు గురవుతుంటారని పేర్కొన్నారు.  నిర్మల్ సింగ్ అమెరికాకు వెళ్లి రెండు వారాలు అవుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది.  

Updated Date - 2022-04-05T01:47:01+05:30 IST