రాష్ట్రవ్యాప్తంగా 70 వేల కేసులు

ABN , First Publish Date - 2020-03-29T09:24:31+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో కేసులు పెట్టాలంటే...

రాష్ట్రవ్యాప్తంగా 70 వేల కేసులు

  • 6,571 వాహనాలు సీజ్‌
  • ఎంత చెప్పినా వినకుంటేనే కేసులు : డీజీపీ 

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో కేసులు పెట్టాలంటే బాధగా ఉంది. ఎంత చెబుతున్నా పోలీసుల మాట వినకుంటే మరేం చేయాలి’ అంటూ నిట్టూర్చారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలవుతోందన్నారు. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. ‘ప్రతి పోలీ్‌సకు కుటుంబం ఉంటుంది. రాత్రింబవళ్లు సెలవుల్లేకుండా ప్రజల కోసం వారు కష్టపడుతున్నారు. బయటికి రావొద్దంటూ ఎంతగానో చెబుతున్నాం. ఎక్కువమంది వింటున్నా, అతి కొద్దిమంది రోడ్లపైకొచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పదేపదే ఇబ్బంది పెడుతోన్న వ్యక్తు లపై కేసులు నమోదు చేస్తే శనివారం మధ్యాహ్నానికి 69,839 కేసులు అయ్యాయి.


ఎక్కువగా ట్రాఫిక్‌ ఉల్లంఘన జరిమానాలు విధించాం. 4,008 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. 6,571 వాహనాలు సీజ్‌ చేశాం’ అని వివరించారు. పోలీసులకు సహకరించి కరోనాపై విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. ‘అనవసరంగా బయటికొచ్చి పోలీసులను ఇబ్బంది పెట్టొద్దు. కేసుల్లో చిక్కుకోవద్దు’ అని హితవు పలికారు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని డీజీపీ సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దుల్లోకి వస్తే లాక్‌డౌన్‌ లక్ష్యాన్నే నీరుగార్చినట్లు అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఎవ్వరూ రావొద్దని కోరారు. 


Updated Date - 2020-03-29T09:24:31+05:30 IST