Abn logo
Jul 30 2021 @ 20:29PM

ఏడు వేల ఏళ్ల గుహ.. నిండా ఎముకలే

రియాద్: పురాతన గుహల్లో అస్థిపంజరాలు, ఎముకలు కనిపించడం మామూలే. అయితే ఓ గుహ మొత్తం ఎముకలతోనే నిండిపోయి ఉంది. ఏడు వేల ఏళ్ల నాటి పురాతన గుహలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న 40 రకాల జంతువుల ఎముకలను పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, హైనాలతో పాటు ఇతర జంతువుల ఎముకలు ఇందులో ఉన్నాయట. వాస్తవానికి ఈ గుహను 2007లోనే కనుగొన్నప్పటికీ లోపలి నుంచి జంతువుల అరుపులు వినబడటంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.


ఇంత పెద్ద సంఖ్యలో ఎముకలు ఉండడంతో సౌది అరేబియాలోని లావా గుహలో ఉన్న ఈ స్థావరం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు.13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్‌ డేటింగ్‌ టెస్ట్‌ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.