70 మార్కులొస్తే ‘0’ వేశారు

ABN , First Publish Date - 2022-06-30T08:11:00+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డులోని కొందరు

70 మార్కులొస్తే ‘0’ వేశారు

తప్పుగా నమోదు చేసిన ఎగ్జామినర్‌

ఇంటర్‌ ఫలితాల్లో వెలుగుచూస్తున్న దారుణాలు

విద్యార్థులకు శాపంగా అధికారుల నిర్లక్ష్యం

దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బోర్డు

ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డులోని కొందరు అధికారులు చెలగాటమాడారు. ఫలితాల వెల్లడిలో తమ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు.   మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాలల్లో అనేక తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. కొందరు విద్యార్థులకు వారికొచ్చిన మార్కులకు బదులుగా సున్నా మార్కులు నమోదైన ఘటనలు వెలుగు చూస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి ఎకనమిక్స్‌ పేపర్‌లో 70 మార్కులు సాధిస్తే సున్నా వచ్చాయని చూపి ఫెయిల్‌ చేశారు. మరో విద్యార్థి ఓ పేపర్‌లో ఒక్క మార్కు సాధిస్తే ఫలితాల్లో మాత్రం ‘0’ వేశారు. బద్రి గోపి (హాల్‌టికెట్‌ నం.2243218740) అనే విద్యార్థికి ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించి ఇంగ్లీషులో 62, తెలుగులో 93, ఎకనమిక్స్‌లో 38, చరిత్రలో 37, పొలిటికల్‌ సైన్స్‌లో 72 మార్కులు వచ్చాయి. అలాగే సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లీషులో 70 మార్కులు, తెలుగులో 90, చరిత్రలో 93, పొలిటికల్‌ సైన్స్‌లో 80 మార్కులు వచ్చాయి. కానీ ఎకనమిక్స్‌లో మాత్రం ‘0’ మార్కులు నమోదయ్యాయి. ఈ విద్యార్థికి సంబంఽధించిన వివరాలను పరిశీలించిన అధికారులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ విద్యార్థికి 70 మార్కులు రాగా అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ సున్నా అని నమోదు చేశారు. ప్రైవేట్‌కు చెందిన ఆ ఎగ్జామినర్‌ మరికొందరు విద్యార్థులకు కూడా ఇలాగే సున్నా మార్కులేసినట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన అధికారులు సదరు ఎగ్జామినర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక, జమ్ములోల్ల హరికిరణ్‌ (2256202884) అనే విద్యార్థి విషయంలో మాత్రం జీరోకు బదులుగా ఒక్క మార్కును గుర్తించారు. హరికిరణ్‌కు సంస్కృతం-2 పేపర్‌లో ఒక్క మార్కు వేస్తే ఫలితాల్లో సున్నా నమోదు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఎగ్జామినర్ల నిర్లక్ష్యం వల్లే ఈ తరహా పొరపాట్లు జరిగినట్టు బోర్డు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర పేపర్లలో మంచి మార్కులు సాధించి ఏదైనా ఓ సబ్జెక్టులో సున్నా మార్కులొచ్చిన విద్యార్థులపై అధికారులు దృష్టి పెట్టారు. అలాంటి విద్యార్థులకు రీ వాల్యూయేషన్‌ విధానంలో మార్కులను సరిచేయాలని భావిస్తున్నారు. అయితే, సాధించిన మార్కులకు బదులుగా సున్నా మార్కులు నమోదైన ఘటనలు ఎన్ని ఉన్నాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.  కాగా, మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సూచించారు. రీ-కౌంటింగ్‌ కోసం ప్రతీ పేపర్‌కు రూ. 100, రీ-వెరిఫికేషన్‌ కోసం ప్రతీ పేపర్‌కు రూ. 600 చొప్పున ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.  

టెట్‌ ఫైనల్‌ కీ విడుదల :

టెట్‌ పరీక్షకు సంబంధించి ఫైనల్‌ కీ బుధవారం రాత్రి విడుదలైంది. ఈ ఫైనల్‌ కీని తమ వెబ్‌సైట్‌లో పెట్టామని, అభ్యర్థులు పరిశీలించుకోవచ్చని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ప్రకటించారు. కాగా, జూలై 1వ తేదీన టెట్‌ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-30T08:11:00+05:30 IST