క‌రోనా తెచ్చిన క‌ష్టం.. నెల రోజుల త‌ర్వాత త‌ల్లి చెంత‌కు చేరిన 7 ఏళ్ల బాలిక‌..

ABN , First Publish Date - 2020-04-08T19:47:55+05:30 IST

విమానాల‌ ర‌ద్దుతో పాటు దేశ స‌రిహ‌ద్దుల‌ను కూడా మూసివేయ‌డంతో చాలా మంది వివిధ దేశాల్లో, విమ‌నాశ్ర‌యాల్లో చిక్కుకుపోయారు.

క‌రోనా తెచ్చిన క‌ష్టం.. నెల రోజుల త‌ర్వాత త‌ల్లి చెంత‌కు చేరిన 7 ఏళ్ల బాలిక‌..

అబుధాబీ: శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనాను క‌ట్టడి చేసేందుకు చాలా దేశాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా నిలిపివేశాయి. విమానాల‌ ర‌ద్దుతో పాటు దేశ స‌రిహ‌ద్దుల‌ను కూడా మూసివేయ‌డంతో చాలా మంది వివిధ దేశాల్లో, విమ‌నాశ్ర‌యాల్లో చిక్కుకుపోయారు. ఇలాగే అబుధాబీ నుంచి జ‌ర్మ‌నీ వెళ్లిన ఓ 7 ఏళ్ల బాలిక కూడా చిక్కుకుని ఏకంగా నెల రోజుల పాటు త‌న కుటుంబానికి దూర‌మైంది. తాజాగా ఇరు దేశాల ఎంబ‌సీ అధికారుల చొర‌వ‌తో బాలిక త‌న కుటుంబం చెంత‌కు చేరింది. సోమ‌వారం రాత్రి బాలిక ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ ప్ర‌త్యేక విమానంలో యూఏఈకి చేరుకుంది. అనంత‌రం బాలిక‌ను అధికారులు ఆమె త‌ల్లికి అప్ప‌గించారు.  


అస‌లేం జ‌రిగిందంటే... గోడివా గార్ట్కే(07) అనే బాలిక‌ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి అబుధాబీలో ఉంటోంది. అయితే, స్కూల్‌కు హాలీడేస్ రావ‌డంతో గోడివా మార్చి నెల ఆరంభంలో జ‌ర్మ‌నీలో ఉండే అమ్మ‌మ్మగారింటికి వెళ్లింది. తిరిగి మార్చి 22న యూఏఈకి రావాల్సింది. కానీ, మార్చి 16న క‌రోనా నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య విమాన స‌ర్వీసులు నిలిచిపోయాయి. దీంతో గోడివా జ‌ర్మ‌నీలోనే ఉండిపోయింది. కూతురిని అబుధాబీకి ర‌ప్పించేందుకు త‌ల్లి విక్టోరియా గార్ట్కే యూఏఈ ఎంబసీ అధికారుల‌ను సంప్ర‌దించింది. విక్టోరియా అభ్య‌ర్థ‌న మేర‌కు యూఈఏ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ గోడివాను తిరిగి త‌ల్లి చెంత‌కు తీసుకోచ్చేందుకు రంగంలోకి దిగింది. చివ‌ర‌కు ఇరు దేశాల దౌత్య‌కార్యాల‌య అధికారుల చొర‌వ‌తో గోడివా సోమ‌వారం తల్లి చెంత‌కు చేరింది. సోమ‌వారం రాత్రి బాలిక ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ ప్ర‌త్యేక విమానంలో యూఏఈకి చేరుకుంది. అనంత‌రం బాలిక‌ను అధికారులు ఆమె త‌ల్లి విక్టోరియాకి అప్ప‌గించారు. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా చిన్నారిని తిరిగి కుటుంబం చెంత‌కు చేర్చినందుకు యూఏఈలోని జర్మన్ రాయబారి పీటర్ ఫిషర్ యూఏఈ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-04-08T19:47:55+05:30 IST