ఏడు పోలింగ్‌ కేంద్రాల మార్పు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-05T06:41:29+05:30 IST

జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి ఏడు పోలింగ్‌ కేంద్రాల మార్పు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

ఏడు పోలింగ్‌ కేంద్రాల మార్పు : కలెక్టర్‌
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

తిరుచానూరు, అక్టోబరు 4: జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి ఏడు పోలింగ్‌ కేంద్రాల మార్పు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.  అలాగే 18 పోలింగ్‌ కేంద్రాలకు పేర్ల మార్పు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022, గ్రాడ్యుయేట్‌, టీచర్లకు సంబంధించి ఓటర్ల నమోదుపై సమీక్షించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు పోలింగ్‌ స్టేషన్ల భవనాలకు మరమ్మతులు, వినియోగంలో లేనందున  మరో ఏడు పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 14, సత్యవేడులో నాలుగు పోలింగ్‌ కేంద్రాలకు గతంలో ఉన్న చోటే ఉంచుతూ పేర్లు మార్పు చేయడం జరిగిందని వివరించారు. వచ్చే ఏడాది మార్చి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ జారీ అయిందని చెప్పారు. ఈనెల ఒకటి నుంచి నవంబరు ఏడో తేదీవరకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబరు 30న తుదిజాబితా ప్రచురిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పులివర్తి నాని, నరసింహయాదవ్‌, రవినాయుడు, ఈశ్వర్‌రెడ్డి, నాగరాజనాయుడు, జనసేన నుంచి సుభాషిణి, సీపీఎం లక్ష్మి, బీజేపీ, సీపీఐ, ఇతర పార్టీనాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతిరూరల్‌ మండలాల్లోని టీడీపీ సానుభూతిపరుల గ్రామాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను తొలగించి దూరపు ప్రాంతాలకు మార్చడంపై కలెక్టర్‌ వెంకటరమణారెడ్డికి పులివర్తినాని తదితరులు ఫిర్యాదుచేశారు.  

Updated Date - 2022-10-05T06:41:29+05:30 IST