పీఎఫ్‌ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు జీవిత బీమా

ABN , First Publish Date - 2021-05-16T07:29:17+05:30 IST

కరోనా సంక్షోభం దృష్ట్యా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌(ఈఎల్‌డీఐ) పథకం కింద తన చందాదారులకు...

పీఎఫ్‌ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు జీవిత బీమా

  • కరోనా సంక్షోభం నేపథ్యంలో గరిష్ఠ ప్రయోజనం పెంపు 

కరోనా సంక్షోభం దృష్ట్యా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌(ఈఎల్‌డీఐ) పథకం కింద తన చందాదారులకు లభించే ఉచిత బీమా గరిష్ఠ ప్రయోజనాల పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచడమే ఈపీఎ్‌ఫఓ ఉద్దేశం. ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో చనిపోయిన చందాదారు నామినీ లేదా చట్టబద్ధ వారసుడు/వారసురాలికి ఈ బీమా కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పఽథకంలో భాగంగా రూ.2.5 లక్షల కనీస డెత్‌ బెనిఫిట్‌తో పాటు రూ.1.75 లక్షల వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. 


ఈఎల్‌డీఐ పథకం  గురించి.. 

  1. పీఎఫ్‌ చందాదారులందరికీ ఈఎల్‌డీఐ పథకం వర్తిస్తుంది. ఉద్యోగులు ఈ పథకం కోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి వేతనంలో 0.5 శాతానికి సమానమైన మొత్తాన్ని యాజమాన్యం ఇందుకోసం జమ చేస్తుంది. 
  2. ఉద్యోగి చనిపోక ముందు కనీసం ఏడాది నుంచి ఉద్యోగంలో కొనసాగుతున్నట్లయితేనే బీమా క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఆ ఏడాది కాలంలో ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారిన సందర్భంలోనూ బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 


ఎంత లభిస్తుంది..? 

  1. చనిపోయిన ఉద్యోగి కనీస వేతనం, పీఎఫ్‌ ఖాతాలో జమైన సొమ్ముపై బీమా క్లెయిమ్‌ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి.
  2. ఉద్యోగి మరణించక ముందు 12 నెలల కాలంలో అందుకున్న కనీస వేతన సరాసరికి 35 రెట్ల డెత్‌ బెనిఫిట్‌ (కనీసం రూ.2.5 లక్షలు)+ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ సరాసరిలో 50 శాతాన్ని బోన్‌స (గరిష్ఠంగా రూ.1.75 లక్షలు)గా కలిపి చెల్లిస్తారు. 
  3. కనీస వేతనంతోపాటు కరువు భత్యాన్ని(డీఏ) కూడా కలిపి వేతన సరాసరిని లెక్కిస్తారు. 
  4. గరిష్ఠంగా అనుమతించే కనీస వేతనం రూ.15,000. ఈ మొత్తానికి 35 రెట్లు అనగా, రూ.5.25 లక్షల గరిష్ఠ డెత్‌ బెనిఫిట్‌ లభిస్తుంది. గరిష్ఠ బోనస్‌ రూ.1.75 లక్షలు. మొత్తం కలిపితే, రూ.7 లక్షల వరకు బీమా క్లెయిమ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.



క్లెయిమ్‌ ఎలా..? 

చనిపోయిన పీఎఫ్‌ చందాదారు నామినీ లేదా చట్టబద్ద వారసుడు/వారసురాలు బీమాను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌ ‘ఫామ్‌ 5ఐఎ్‌ఫ’ను నింపి కంపెనీ యాజమాన్యంతో అటెస్ట్‌ చేయించి సంబంధిత ఈపీఎ్‌ఫఓ కార్యాలయంలో సమర్పించాలి. 

  1. కంపెనీ యాజమాన్యం సంతకం లభించని పక్షంలో ఎవరైనా గెజిటెడ్‌ అధికారితోనూ అటెస్ట్‌ చేయించవచ్చు. 
  2. ఈపీఎఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫామ్‌ 5ఐఎ్‌ఫతో పాటు ఇతర డాక్యుమెంట్లు సమర్పించాక 30 రోజుల్లో క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన పక్షంలో, జాప్యమైన కాలానికి గాను క్లెయిమ్‌ సొమ్ముపై 12 శాతం వార్షిక వడ్డీ కూడా లభిస్తుంది. 

- ఈ బీమా క్లెయిమ్‌ పూర్తిగా పన్ను రహితం

Updated Date - 2021-05-16T07:29:17+05:30 IST