Abn logo
Sep 21 2021 @ 00:03AM

కస్తూరిదేవి@ 70

కస్తూరిదేవి విద్యాలయం

బాలికా విద్యాలయ భవనాలకు ఏడు దశాబ్దాలు

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), సెప్టెంబరు 20 : నెల్లూరు నగరంలో కస్తూరిదేవి విద్యాలయం అనగానే స్వాతంత్య్ర సమర యోధురాలు పొణకా కనకమ్మ జ్ఞప్తికి వస్తుంది. బాలికల విద్య కోసం పరితపించిన ఆమె కస్తూరిదేవి పాఠశాలను స్థాపించారు. నాటకాలు ప్రదర్శించడం ద్వారా నిధులు సేకరించి ఆ విద్యాలయానికి భవనాలు నిర్మించారు. ఇది జరిగి సరిగ్గా నేటికి 70 వసంతాలు. 1946 సెప్టెంబరు 9న అప్పటి విద్యామంత్రి టీఎస్‌ అవనాశ లింగంశెట్టి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా 1951 సెప్టెంబరు 21వ తేదీన నాటి విద్యా మంత్రి మాధవ మీనన్‌ ప్రారంభించారు. వారి సతీమణి మట్టెమ్మాల్‌ పతాకోత్సవం చేశారు. ఇదంతా బెజవాడ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు సాయంత్రం ప్రఖ్యాత సంగీత విదుషీమణి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి కచేరీ వీనులవిందుగా సాగింది. నర్తకీమణి రాధ నృత్యాలు కళా ప్రియులకు కనువిందు చేశాయి. 

నగరంలోని పొగతోటలో 1923లో ప్రకాశం పంతులు ప్రారంభించిన ఈ పాఠశాలలో తొలి ఏడాది 93 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. రాళ్లపల్లి వెంకటసుబ్బయ్య ప్రధానోపాధ్యాయులు. 1928 నుంచి నిధుల కోసం కృషి చేసి దర్గామిట్టలో ప్రస్తుత స్థలం కొనుగోలు చేశారు.