విషాదం: హోమియోపతి సిరప్ తాగిన ఏడుగురి మృత్యువాత

ABN , First Publish Date - 2021-05-07T01:31:44+05:30 IST

మద్యానికి బదులుగా ఆల్కహాల్ కలగలిసిన హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మరణించిన విషాద

విషాదం: హోమియోపతి సిరప్ తాగిన ఏడుగురి మృత్యువాత

బిలాస్‌పూర్: మద్యానికి బదులుగా ఆల్కహాల్ కలగలిసిన హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మరణించిన విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగిందీ ఘటన. ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే  మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.  


కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. వీరు కరోనాతో చనిపోయారని భావించిన కుటుంబ సభ్యులు అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ తర్వాతి రోజు ఉదయం అంత్యక్రియులు నిర్వహించారు. ఇదే సిరప్‌ను తీసుకుని అస్వస్థతకు గురైన ఖేమ్‌చంద్ ధురి (40), కైలాశ్ ధురి (50), దీపక్ ధురి (30)లను బిలాస్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు ముగ్గురూ మరణించారు. 


సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు అదే సిరప్‌ను తాగి విషమ పరిస్థితిలో ఉన్న మరో ఐదుగురిని ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. వీరిలో నలుగురిని చత్తీస్‌గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సీఐఎంఎస్)తోపాటు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ వారికి ఆ సిరప్ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు దానిని మద్యానికి బదులుగా తాగినట్టు తెలుస్తోందని, అయితే మరణానికి కచ్చితమైన కారణం తెలియదని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-07T01:31:44+05:30 IST